Sri Krishna Deva rayalu
-
అక్షర పాలకులు
రాజ్యాలు, వైభవాలు ఉన్నాయి కదా అని పొద్దంతా విలాసాల్లో మునిగి తేలితే గొప్పేముంది? జనం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి ఆలోచనే కొందరు పాలకులకు చరిత్రలో ప్రత్యేక పేజీలను కేటాయించింది. రాచరికాలు కావచ్చు, ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు... పాలనా దక్షత ఒక్కటే ఉంటే పాలకుడిగానే మిగిలిపోతారు. పాలనతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వెలిగిపోతారు. చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ప్రజారంజకంగా పాలించారు. కొందరు ప్రజాకంటక పాలన అందించి కాలగర్భంలో కలిసిపోయారు. చాలా కొద్దిమంది మాత్రం మంచి పాలన అందించడంతో పాటు ‘కూసింత కలాపోసన’ చేసి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి సాహితీ పాలకుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలే! ప్రజాసంక్షేమ పాలనకు పెట్టింది పేరు అయిన కృష్ణదేవరాయల హయాంలో సాహిత్యానికి పట్టం కట్టారు. ‘భువన విజయం’ పేరుతో అష్ట దిగ్గజ కవులను కొలువు తీర్చిన కృష్ణదేవరాయలు వారికి ఏమాత్రం తీసిపోకుండా తానూ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. తెలుగు, కన్నడ, తుళు, తమిళ భాషలతో పాటు సంస్కృతంలోనూ రాయలు పండితుడు. సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలస చరితం, రసమంజరి వంటి గ్రంథాలు రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అను గోదాదేవి కథ అన్న అద్భుత కావ్యాన్ని జాతికి కానుకగా ఇచ్చాడు. భారత దేశపు చివరి చక్రవర్తిగా నిలిచిపోయిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ అద్భుతమైన సూఫీ కవి. ఉర్దూభాషా పండితుడైన బహదూర్ షా కలం పేరు జఫర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మీర్జా గాలిబ్, ఇబ్రహీం జౌఖ్... బహదూర్ షా ఆస్థానంలోని కవులే. బ్రిటిష్ పాలకులు తనను బర్మాలో నిర్బంధించినప్పుడు, తన నిస్సహాయతను దృష్టిలో ఉంచుకుని బహదూర్ షా రాసిన ‘నా కిసీకీ ఆంఖోం కా నూర్ హూం’ అనే గజల్ ఇప్పటికీ కచ్చేరీలలో మార్మోగుతూ ఉంటుంది. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన విన్స్టన్ చర్చిల్ అద్భుతమైన రచయిత. సైద్ధాంతికంగా చర్చిల్‌ను ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు; ఆయన రచనల్లోని ఆలోచనలనూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన శైలిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించి ఎన్నో కీలక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన చర్చిల్ తిరుగులేని చమత్కారి కూడా! బ్రిటన్ను పాలించిన ప్రధానులందరిలోకీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చర్చిల్ రచయితగా నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాహితీ పిపాసి. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను రాసిన నెహ్రూను ‘పొయట్ ఎట్ హార్ట్’ అని ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తించారు. ఆ ఒక్కముక్క చాలదూ... నెహ్రూ మంచి రచయిత అనడానికి! చైనాను సుదీర్ఘ కాలం పాలించిన మావో జెడాంగ్ కవులు మెచ్చిన రొమాంటిక్ పొయెట్. వియత్నాం విప్లవ యోధుడు హోచిమన్ కవిత్వం అత్యంత సహజంగా ఉంటుందని పండితులే మెచ్చుకున్నారు. భారత ప్రధానుల్లో నెహ్రూ తర్వాత పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయ్ సాహితీ స్రష్టలే. భావోద్వేగాలు, భావావేశాలు కలగలిసిన వాజ్‌పేయ్ కవితలు కదం తొక్కిస్తాయి. అలాగని పీవీ తక్కువ వాడేమీ కాదు. పండితులకే కొరకరాని విశ్వనాథ ‘వేయిపడగల’ను హిందీలోకి అనువదించిన మేధావి. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో వెలిగిన గిరిధర్ గమాంగ్ సకల కళావల్లభుడే. గిరిజన సంగీతం గొప్పతనాన్ని యావత్ లోకానికీ చాటి చెప్పాలన్న కసితో దశాబ్దాల తరబడి కృషి చేసిన గమాంగ్ స్వతహాగా అద్భుత సంగీతకారుడు. రక రకాల గిరిజన సంగీత వాద్య పరికరాలు వాయించడంలో పండితుడు. ఒరియాలో మంచి కవి. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన మఖ్దూమ్ మొహియుద్దీన్ నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు, అనంతరం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. విశ్వ విఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా రాసిన ఓ నాటకాన్ని మఖ్దూమ్ ఉర్దూలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఆసక్తిగా వీక్షించిన రవీంద్రుడు ఆనందం పట్టలేక వేదికపైనున్న మఖ్దూమ్‌ను కౌగలించుకున్నాడు. మఖ్దూమ్ రచనలను ప్రముఖ రచయిత గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఒకప్పుడు మంచి సాహిత్యాన్ని అందించిన పాలకులు ఉండేవారు. ప్రపంచం అసూయతో రగిలిపోయేంత పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇçప్పుడు అటువంటి అక్షర పాలకులు లేరు. మంచి కవిత్వమో, కథో రాయడం మాట దేవుడెరుగు... నేడు పలువురు పాలకులకు మంచి పుస్తకం ఇస్తే కనీసం చదవలేని దుఃస్థితి. మళ్లీ నిరుటి మెరుపులు కొత్త వెలుగులు కాయిస్తాయనీ, నిరుడు మురిపించిన హిమసమూహాలు చల్లటి కబురందిస్తాయనీ ఆశిద్దాం. గతం వలె మళ్లీ సాహితీ కుసుమాలు వికసిస్తాయని కాంక్షిద్దాం. -
పేదల చెమటచుక్కల ‘రహస్యం’
కష్టజీవులైన పేదసాదల గురించి. వారి రెక్కల కష్టం గురించి ఇంతగా పలవరించి, కలవరించిన పాలకుడు, నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు తప్ప మరొకరు లేరు. తన విశిష్ట కావ్యం ‘ఆముక్తమాల్యద’లో సమాజంలోని శూద్రజాతులైన అట్టడుగు పేదసాదల శ్రమజీవనానికి స్వయంగా రాయలు మనసారా నివాళులర్పిం చాడు..రాజుల, పాలకుల పాదాలలోని ‘భాగ్యచక్రాల సుడికి’ భుజాలపై కాయలుకాసేట్టు కాడి, మేడి పట్టి పొలాలు దున్ని కోటానుకోట్లుగా పంటల్ని పండించే సుజనులే పూజించదగిన సిసలైన ‘శూద్రజాతి’ అన్నాడు రాయలు. అలాంటి రాయల చరిత్రకు మరొక విశిష్ట కోణంగా మనముందున్న సమీక్షా గ్రంథం హంపీ విజయనగర శ్రీకృష్ణదేవరాయ చరిత్ర ‘రాయ’. విభిన్న జాతుల, భాషల మధ్య స్నేహపూర్వకమైన సాంస్కృతిక సంసర్గత ఎలా ‘పుచ్చపువ్వుల్లా’ రాయలకాలంలో విరియబూచిందో ‘రాయ’ గ్రంథకర్త శ్రీనివాసరెడ్డి అత్యద్భుతంగా ఈ రచనలో కళ్లముందు కట్టి చూపించాడు. ‘నృపుల పదహల రేఖల కెల్ల మాభు జాగ్రహల రేఖలే మూలమనుచు కోటి కొండలుగ ధాన్యరాసులు పండువీట సుజన భజనైక విఖ్యాతి శూద్రజాతి’ కష్టజీవులైన పేదసాదల గురించి, వారి రెక్కల కష్టం గురించి ఇంతగా పలవరించి, కలవరించిన పాలకుడు, నాయకుడు ఎవరై ఉంటారు? అంతేగాదు, ఒక మహాసామ్రాజ్య విస్తరణకు పథకం వేసుకునే పాలకుడి లక్ష్యం సంపదను సమకూర్చుకోవడమే తప్ప మరొక లక్ష్యం వైపు మనసు మళ్లదు. కానీ ఆ మహాసామ్రాజ్య నిర్మాణం ఎంత గొప్ప దైనా, మరింత పెద్దదైనా సామ్రాజ్య ప్రజల బాగోగులు పట్టించుకోని రాజ్య మెందుకు, ఆ పాలకుడెందుకు? సామ్రాజ్యపు ఒడ్డుపొడుగులు కాదు చూడవలసింది, ఆ రాజ్యంలోని సంపద సృష్టికర్తలైన రైతన్నల పేదసాదల సౌకర్యార్థం పాలకుడు ఎన్ని చెరువులు కట్టించాడు, మరెన్ని పంటకాల్వలు తవ్వించాడన్నదే ముఖ్యం. అలాగే రైతాంగ ప్రజలపైన వారు పండించే పంటలపైన విధించే పన్నుల భారాన్ని పాలకుడు తగ్గించి, ఫలసాయాన్ని పెంచేందుకు తోడ్పడాలి. కనుకనే అతడు పదునుగా వ్యవహరించే ధర్మార్థాలు రెండూ వృద్ధి చెందు తాయని పాలకుడి ‘పాలసీ’గా సుమారు 400 ఏళ్లనాడు (16వ శతాబ్దం) ప్రవచించి ఎలుగెత్తి చాటిన ఆ పాలకుడెవరు? ఇంకెవరు, తెలుగు–కన్నడ రాజ్యాధినేతగా దక్షిణభారతం లోనే గాక యావ ద్భారతంలోనే మహోన్నత ప్రజారహిత పాలకునిగా కీర్తి ప్రతిష్టలందుకున్న హంపీ (బళ్ళారి) విజయనగర పాలక చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. తన విశిష్ట కావ్యం ‘ఆముక్త మాల్యద’లో సమా జంలోని శూద్రజాతులైన అట్టడుగు పేదసాదల శ్రమజీవనానికి స్వయంగా రాయలు మనసారా నివాళులర్పించాడు. అంటే ఈరోజుకీ తగిన గుర్తింపునకు నోచుకోని శూద్రజాతి శ్రమ విలువను, పాలకుల భోగభాగ్యాలకు ఆదరవుగానే ఉన్న ఆ దళిత జీవుల చెమటచుక్కల విలువను కీర్తించినవాడు రాయలు. రాజుల, పాలకుల పాదాలలోని ‘భాగ్యచక్రాల సుడికి’ భుజాలపై కాయలు కాసేట్టు కాడి, మేడి పట్టి పొలాలు దున్ని కోటానుకోట్లుగా పంటల్ని పండించే సుజనులే పూజిం చదగిన సిసలైన ‘శూద్రజాతి’ అన్నాడు రాయలు. ఈ శూద్రజాతి వెనుక కులపిచ్చితో మనువు తన ధర్మశాస్త్రంలో చాలా కథ అల్లి ముఖం నుంచి, చేతులనుంచి, బాహువులనుంచి, చివరికి పాదాలనుంచి ఒకరిని పుట్టించి, నాలుగు వర్ణాలలో పాదా లనుంచి పుట్టిన వారికి ‘శూద్రులు’ అని పేరుపెట్టి న్యూనపరిచాడు. కులపిచ్చికొద్దీ అయిదవ కులం ఇకలేనట్టే నని (నాస్తితు పంచమ) శాసించేశాడు. ఈ తప్పుడు వర్ణ విభజనను ఈసడించుకున్న రాయలు కష్టజీవులైన దళిత శూద్రులనే సమాజశ్రేయస్సుకు మూలకందాలుగా కీర్తించాల్సిన సుజనులగా దండోరా వేశాడు. అలాంటి ప్రజల మని షిగా ఎదిగి సుమారు తన 30 ఏళ్ల రాజ్య పాలనలో భారతదేశంలోని కొందరు మహాచక్రవర్తులలోనే గాక ప్రపం చంలోని నలుగురే నలు గురు అత్యున్నత స్థాయి పాలకులు జూలియస్ సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్ల సరసన శ్రీకృష్ణదేవ రాయలను అధిష్టించారు. అలాంటి రాయల చరిత్రకు మరొక విశిష్ట కోణంగా మనముం దున్న సమీక్షా గ్రంథం హంపీ విజయనగర శ్రీకృష్ణదేవరాయ చరిత్ర ‘రాయ’. ఈ గ్రంథకర్త శ్రీనివాసరెడ్డి. రాయల ఆముక్తమాల్యదనే గాక, కాళిదాసు ‘మేఘదూతం’ ‘మాళవికాగ్ని మిత్రం’ కావ్యరాజాలను కూడా ఆంగ్లంలోకి అనువదించిన పండితుడు, ప్రసిద్ధ అనువాదకుడు, సంగీత కళాకారుడూ బెర్కిలీ యూనివర్సిటీలో దక్షిణాసియా భాష లలోనూ, ప్రాచీన సాహిత్యాలనూ పుక్కిట పట్టిన ఉద్దండుడు. ప్రస్తుతం ఈయన బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఐఐటీ గాంధీనగర్‌లో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. తన తాజా విశిష్ట రచన ‘రాయ’ బయటికి వెలువడే దాకా ఈ గ్రంథ రచయిత శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఒక అజ్ఞాత విశిష్ట రచయితగానే ఉండిపోయారన్న ప్రసిద్ధ రచయిత, విశ్లేషకుడైన రాజమోహన్ గాంధీ అంచనా అత్యుక్తి కాదు. అటు తన సామ్రాజ్య రక్షణలోనూ, సమకాలీన శత్రురాజులు కవ్విస్తే తప్ప యుద్ధాలకు దిగని పాలనా దక్షునిగా సాహితీ సమ రాంగణ చక్రవర్తిగా ‘దేశభాషలందు తెలుగు భాష’గా నిలిపి ప్రోత్స హించిన భాషా తాత్విక సమన్వయకర్తగా తన ఇరవయ్యే ళ్లపైబడిన పాలనాదక్షతతో పాలించి కీర్తిశిఖరాలకు చేరినవాడు రాయలు. ఆయన కాలం నాటి దక్కను పీఠభూమి ఉత్తర, దక్షిణ భారతాలకు చెందిన పలురకాల మతాల వారికి, అనేక భాషలకు, హిందూ–ముస్లింలకు, పోర్చుగీస్, పర్షియన్ దేశీయులకు కేంద్ర స్థానంగా వర్ధిల్లిన దశ. ఈ పరస్పర వైవిధ్యపూరితమైన విభిన్న జాతుల, భాషల మధ్య స్నేహ పూర్వకమైన సాంస్కృతిక సంసర్గత ఎలా ‘పుచ్చపువ్వుల్లా’ రాయల కాలంలో విరియబూచిందో ‘రాయ’ గ్రంథకర్త అత్యద్భుతంగా ఈ రచ నలో కళ్లముందు కట్టి చూపించాడు. గ్రంథకర్త కేవలం పోర్చుగీస్, పర్షియన్, చారిత్రక, సాహిత్య ఆధారాల పరిశీలనతోనే సరిపెట్టుకోకుండా ఇంతవరకూ పెక్కుమంది చరిత్రకారుల పురాతత్వవేత్తల దృష్టికి రాని పలు తెలుగు సాహిత్య ఆధారాలను కూడా తవ్వి పరిశోధించి, పరిశీలించిన దాని ఫలితమే ఈ తాజాగ్రం«థ రచన. ఈ తవ్వకంలో ఈ గ్రంథకర్త, ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్, కె.ఎ.నీలకంఠశాస్త్రి, నేలటూరి వెంకట రమ ణయ్య లాంటి పురాతత్వవేత్తలు, ప్రసిద్ధ చరిత్రకారులు తవ్వి తీయగా, ప్రసిద్ధ చారిత్రక సాహిత్య గ్రంథాలకు తిరిగి ప్రాణంపోస్తున్న ఎమెస్కో ప్రచురణకర్తలు సంకలనకర్తలయిన విజయకుమార్, డి.చంద్రశేఖర్‌లు అభినందనీయులైనారు. ఒక్క ఊపుతో అపురూపంగా ఇటీవలనే వెలు వడిన (ఆలస్యంగానైనా) ఇంతకాలం ఆసక్తిగల చదువరులకు అలవి కాని ‘విజయనగర చరిత్ర– ఆధారాలు’ అనే చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆధారాల పేరిట రెండు విశిష్ట గ్రంథాలను పునర్నిర్మించడం ప్రశంసనీయం. సుమారు 5 శతాబ్దాల దాకా విస్తరించిన 20 మంది విజయనగర వంశీకుల చరిత్రకు అనుపమానమైన నివాళిగా శ్రీనివాస రెడ్డి సరికొత్త రచన ‘రాయ’ను పేర్కొనడం అతిశయోక్తి కాబోదు. ఈ గ్రంథం విశిష్టత అంతా ఒక్క మాటలో– ‘ఉండంతలోనే కొండంత’గా చూపడంలోనే ఉంది. రాజ్య విస్తరణలో ఉన్న పాల కులకు ఎదుటివారిని జయించాలన్న తహతహ ఒక విజిగీష. కానీ రాయలు సమకాలీన యుద్ధాలలో అనివార్యంగా పాల్గొనవలసి వచ్చినా ఎదుటివారి కవ్వింపులకు ముగింపు తేవడానికే గాని పర రాజుల భూభాగాలను ఆక్రమించడానికి కాదు. ఇందుకు పక్కా ఉదా హరణలు హిందూరాజైన ఒరిస్సా పాలకుడు ప్రతాపరుద్ర గజపతిని, ముస్లింరాజైన బహమనీ ఆదిల్‌షాలను యుద్ధంలో ఓడించి, స్వాధీనం చేసుకున్న వారివారి భూభాగాలను తిరిగి వారికే వాపసు చేసి యుద్ధా లలో పట్టుబడిన వారి సంతానానికో, బంధుగణానికో విద్యాబుద్ధులు గరిపించిన ఘనత ఒక్క రాయలదేనని గుర్తించాలి. శ్రీశ్రీ అన్నట్టు వ్యక్తి పూజను మానగలం గాని, వీరపూజను మానలేం. కటకం, బస్తర్, నాగపూర్, గోల్కొండ, తెలంగాణ (నిజాం పాలనలో), చెన్నపురి, చంగల్పట్టు, తంజావూరు, బెంగళూరు, దేవర కోట, పురుక్కోట, కటకం (ఒరిస్సా) ఒక్కమాటలో దక్షిణ భారతంలో రాయలు సాధించిన విజయాలకు సామాన్యుడైన ఒక రజకుడి నోట ‘కాదని వాదుకు వస్తే కటకందాకా మనదేరా’ అన్న పాట నాటినుంచి నేటిదాకా ఖ్యాతిలోనే ఉండిపోయింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పల్నాడు అభివృద్ధే లక్ష్యం
సాక్షి, గుంటూరు : నరసరావుపేట లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పిన్న వయస్కుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు రికార్డు సృష్టించారు. తొలి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ‘సాక్షి’కి ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందేది తానేనని, పల్నాడు ప్రజల ఆశలు తీర్చటమే లక్ష్యంగా పనిచేస్తానని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టంచేశారు. ప్రశ్న : పల్నాడు ప్రాంతం నుంచి పోటీచేయడాన్ని మీరు ఏవిధంగా భావిస్తున్నారు? జవాబు: చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో చరిత్ర ఉన్న పల్నాడు సీమను అభివృద్ధి చేసే అవకాశం రావటం నా జీవితంలోనే గొప్ప విషయం. ప్రశ్న: ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? జవాబు: నరసరావుపేట ఎంపీగా ఈ ఎన్నికల్లో నేనే గెలవబోతున్నా. పల్నాడు ప్రజలు అఖండ మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 సీట్ల వరకు రాబోతున్నాయి. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మూడు దశాబ్దాలపాటు మేము నవ్యాంధ్రకు సువర్ణ పాలన అందించబోతున్నాం. ప్రశ్న: గెలుపుపై అంత నమ్మకం ఎలా వచ్చింది? జవాబు: నరసరావుపేట పార్లమెంటు సమన్వయకర్తగా మా పార్టీ నన్ను ఆరునెలల క్రితం నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్య, వారితోనే తిరుగుతున్నా. ఇప్పటి వరకు 900 గ్రామాలకు పైగా సందర్శించా. 70 వేలకు పైగా కిలోమీటర్లు తిరిగి 12 లక్షల మందికి పైగా ప్రజలను కలిశా. ఇదంతా నాకు ఎంతో మేలు చేసింది. ప్రజల నాడి తెలిసింది. టీడీపీ ఐదేళ్లపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో విసిగిపోయారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఎదురుచూస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్‌పై జనానికి ఉన్న నమ్మకం వారి మాటల్లోనే ప్రతిబింబిస్తోంది. ప్రశ్న: పార్లమెంటు స్థానం పరిధిలో ప్రధానంగా ఉన్న సమస్యలను గుర్తించారా? జవాబు : సమస్యలు చాలా ఉన్నాయి. వాటిపై అధ్యయనం చేసేందుకు ఐదు నెలల కిందటే 50 మందితో ఒక కమిటీని ఏర్పాటుచేశా. వారు ప్రతి గ్రామాన్నీ సందర్శించి ప్రజల సమస్యలపై సమగ్రమైన నివేదిక అందజేసింది. ప్రశ్న: ఆ కమిటీ మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమిటి? జవాబు : వందల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. సాగునీరులేక అన్నదాతలు ఐదేళ్లుగా అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోగా, వర్షాలు లేక రైతులు, ఉద్యోగాలు లేక యువత ఆందోళన చెందుతోంది. పార్లమెంటు పరిధిలో ఒక్క యూనివర్సిటీ లేదు. ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. ఘన చరిత్ర గల ఈ పార్లమెంటు పరిధిలో ఒక్క మెడికల్ కళాశాల లేకపోవటం బాధ కలిగిస్తోంది. పల్లెల్లో పేదలకు కూలి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉంది. ఆర్టీసీ బస్సు ముఖం చూడని పల్లెలు ఇంకా ఉన్నాయి. ప్రధాన రహదారులు విస్తరణ లేక రోజూ ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ప్రశ్న: మీరు గెలిచి అధికారంలోకి వస్తే సాగునీటి సమస్య తీరుస్తారా? అదెలా సాధ్యం? జవాబు: తప్పకుండా సాగునీటిసమస్య తీర్చొచ్చు. గోదావరి జలాలను పల్నాడుకు పరుగులు పెట్టించొచ్చు. రూ.1500 కోట్లు ఖర్చుచేస్తే చాలు కృష్ణానదితో సంబంధం లేకుండా సాగర్ కాలువలను గోదావరి జలాలతో నింపొచ్చు. పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తిచేసుకుంటే గోదావరి జలాలను పులిచింతలకు తీసుకురావచ్చు. అమరావతి మండలం వైకుంఠపురం వద్ద ఒగ మెగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటే అక్కడి నుంచి గోదావరి జలాలను నకరి కల్లు అడ్డరోడ్డు వద్ద సాగర్ జలాల్లో కలపొచ్చు. ఈ కాలువ నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను బుగ్గవాగు రిజర్వాయర్‌కు తరలించుకుంటే పల్నాడు మొత్తానికి సాగునీరు అందుతుంది. కేవలం రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయొచ్చు. పోలవరం పూర్తయ్యేలోగా పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తెచ్చుకొని పల్నాడును రతనాల సీమగా మార్చుకోవచ్చు. మేం గెలిస్తే ఇదే మా ప్రథమ ప్రాధాన్యం అవుతుందనటంలో సందేహమే లేదు. ప్రశ్న: తాగునీటి సమస్యను ఏవిధంగా పరిస్ఖరిస్తారు? జవాబు : సాగర్ కాలువల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పల్నాడు పల్లెలు అన్నింటికీ తాగునీరు అందించొచ్చు. కేవలం రూ.1500 కోట్లు ఖర్చుచేస్తే గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో తాగునీటి గ్రిడ్లను నిర్మించి అన్నీ గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. పిడుగురాళ్ల పట్టణానికి కృష్ణా జలాలను తరలించే ఉద్దేశంతో రూ.80 కోట్లతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మూలన పడినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రశ్న: పల్నాడు అభివృద్ధికి మీ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? జవాబు : పల్నాడులో ఎక్కువగా మిరప, పత్తి పండిస్తారు. ఈ రెండు పంటలకు మద్దతు ధర దక్కాలంటే వరంగల్ తరహాలో ఓ పత్తి విక్రయం కేంద్రం, గుంటూరు తరహాలో మిర్చి యార్డును ఇక్కడ అభివృద్ధి చేయాలి. వంద ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా అమలుకు నోచుకోవట్లేదు. దీన్ని వెంటనే పట్టాలు ఎక్కించాలి. 500 ఎకరాల్లో మెగా టూరిజం పార్కు, మూడు వందల మెగా వాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కాయి. ఈ ఫైళ్ల బూజును దులపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్న: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? జవాబు : చాలా బాగా సాగుతోంది. విరామం లేకుండా ప్రజల్లోనే ఉంటున్నా. నేనే కాదు నా కోసం నా భార్య మేఘన, చెల్లెలు రుద్రమదేవి విరామంలేకుండా కష్టపడుతున్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలోనే ఉంటూ నాకు మద్దతుగా నిలుస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. నాన్నగారు లావు రత్తయ్య క్షేత్రస్థాయిలో నా విజయంకోసం శ్రమిస్తున్నారు. ప్రశ్న: ఓటర్లకు ఏమైనా చెబుతారా? జవాబు : నాయకుడు పరిగెత్తే స్థితిలో ఉంటేనే ప్రజలు ఆయనతో పరిగెత్తగలరు. నాయకుడు, ప్రజలు కలిస్తే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. నాయకుడు కనీసం నడవలేని స్థితిలో ఉంటే ప్రజలకు లాభం ఉండదు. ఓట్లు వేయించుకొని ఆ తర్వాత కన్పించకుండా వెళ్లిపోయే మనస్తత్వం నాదైతే కాదు. మా నాయకుడు నాకు నరసరావుపేట బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి నేను ఇక్కడి ప్రజల మధ్యనే ఉంటున్నా. వారి సమస్యలు వింటూనే ఉన్నాను. పని చేసేవారెవరో, స్థానికంగా అందుబాటులో ఉంటున్న వారెవరో, ఉత్సాహంగా జనంతో కలిసి తిరుగుతున్న వారెవరో గుర్తించి ఓట్లేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
విద్యుత్ షాక్‌తో నాలుగేళ్ల బాలుడి మృతి
ప్రకాశం జిల్లా నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం శ్రీకృష్ణదేవరాయులు (4) తోటి పిల్లలతో కలసి ఆడుకుంటూ వారితోపాటు మిద్దెపైకి వెళ్లాడు. అక్కడ గొడుగును విద్యుత్ తీగలకు తగిలిస్తున్న క్రమంలో చిన్నారి విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఆడుతూ పాడుతున్న ఉన్న చిన్నారి.. కళ్ల ముందే విగత జీవిగా మారడంతో.. ఆ ప్రాంత మంతా విషాదం అలముకుంది.