సాక్షి, విజయవాడ: న్యూయార్క్ నగరంలోని టైమ్స్‌స్క్వేర్‌లో ఇచ్చిన ప్రకటన తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిందని.. ఈ ప్రకటనకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ స్పష్టం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని ప్రవాసాంధ్రులకు తెలియజేశానని పేర్కొన్నారు. తెలుగువారిలో ధైర్యాన్ని నింపే ఇటువంటి మంచి ప్రయత్నంపై కూడా దుష్ప్రచారానికి దిగి టీడీపీ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు. ధర్నాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేసింది గత చంద్రబాబు ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన టీడీపీ.. ప్రస్తుతం న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ముఖ్యమంత్రి జగన్ సందేశం )
కాగా కోవిడ్-19(కరోనా వైరస్)విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలుగువారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో’ ప్రత్యేక స్క్రీన్ ఏర్పాట్ల ద్వారా తన సందేశాన్ని వినిపించిన విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, అధైర్యపడొద్దని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో టీడీపీ సోషల్‌మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పండుగాయల రత్నాకర్ టీడీపీ తీరుపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ... ‘‘కరోనా వ్యాప్తి నియంత్రణ, నివారణ కోసం ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైరస్ సోకిన వారిని గుర్తించడం మొదలు, వారికి మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రపంచంలోనే ఉత్తమ విధానాలను అనుసరిస్తోంది. అదే సమయంలో ప్రజల నిత్యావసరాలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్ధ చర్యలను తీసుకుంటోంది.
ఇక.. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులకు మన రాష్ట్రంలోని వారి కుటుంబాల బాగోగుల పట్ల ఆందోళన సహజం. వారలా ఆందోళన చెందకూడదన్నదే సీఎం జగన్ ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం వారికి తోడుగా ఉందని ధైర్యం చెప్పేందుకు నిండు మనసుతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకే నా సొంత ఖర్చుతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ప్రకటన ఏర్పాటు చేశాను. కానీ టీడీపీ ఇక్కడ కూడా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. స్క్వేర్ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోంది. సొంత మనుషులకు, అనుకూల మీడియాకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టిన టీడీపీ గురించి అందరికీ తెలుసు.
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ప్రజలకు తెలిసిందే. అందుకే టీడీపీ ఐదేళ్ల దోపిడీపై విసుగుచెందిన ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా మీరు మారలేదు. ఎలాంటి ఆధారాల్లేకుండా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టాను. సందేహం ఉన్నవారు మందుకొస్తే నివృత్తి చేస్తాను’’అని చురకలు అంటించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విష ప్రచారానికి పూనుకున్నవారిపై చట్టప్రకారం ముందుకెళ్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్ –19 రెగ్యులేషన్, 2020, విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని 54వ సెక్షన్, ఐపీసీ సెక్షన్ 505 కింద వారు శిక్షార్హులు అని పండుగాయల రత్నాకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment