పరేశ్ ధనాని (ఫైల్ ఫొటో)
అహ్మదాబాద్ : ఎన్నికల సమరం ముగిసింది. ఓడిపోయినా, వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంపై పోరాటంలో ఎటువంటి రాజీ పడబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. గతంలో కంటే పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం, ఉద్యమ నేపథ్యం నుంచి దూసుకొచ్చిన యువ నాయకత్వం ఆ పార్టీ నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 77 కాగా, స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని సహా 6గురు తోడైతే.. మొత్తం 83 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా వ్యవహరించబోతున్నారు. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరన్న ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
పరేశ్ కే అవకాశం?: గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభ నిర్వాహకుడిగా పేరు తెచ్చుకున్న యువనేత పరేశ్ ధనానిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. సౌరాష్ట్రలోని అమ్రేలి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరేశ్.. కొంతకాలంగా ప్రభుత్వంపై అలుపెరగని పోరు చేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. పత్తిరైతుల సమస్యలపై అసెంబ్లీలో, బయటా ఆయన చేసిన ఆందోళనలు రైతాంగాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే పత్తి, వేరుశెనగ రైతులు ఎక్కువగా ఉండే సౌరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ చక్కటి ఫలితాలను రాబట్టగలిగింది. అలా సౌరాష్ట్రలోని 11 జిల్లాల్లో మూడింటిలో బీజేపీ పత్తాలేకుండాపోయింది. ఆ జిల్లాల్లో కాంగ్రెస్ 30 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 23కే పరిమితమైపోయింది. వ్యక్తిగతంగా పరేశ్ సాధించిన విజయం కూడా సాధారణమైనదేమీకాదు. అమ్రేలిలో బలమైన పోటీదారు భవ్కూభాయ్ ఉంధాడ్ (బీజేపీ) పై 12,029 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పరేశ్ కు చాలా దగ్గరి సంబంధాలుండటం మరింతగా కలిసొచ్చే అంశం.
కొత్త నీరు : గుజరాత్ లో బీజేపీ 22 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న దరిమిలా.. ప్రతిపక్ష నేత బాధ్యతలను శక్తిసింహ్ గోహ్లీ, అర్జున్ మొద్వాడియా, సిద్దార్థ్ పటేల్, తుషార్ చౌదరి తదితరులు నిర్వర్తించారు. కాగా, వారంతా నేటి ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో కొత్త తరానికి ప్రతిపక్షనేత బాధ్యతలు కట్టబెట్టాల్సిన సందర్భం నెలకొంది. పరేశ్ ధనాని, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేష్ మేవాని తదితర ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో గుజరాత్ విపక్షం మునుపటికంటే బలంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment