సాక్షి, విశాఖపట్నం: ‘అసలు నేను కాపునే కాదు. కాపుల ఓట్లు నాకు అక్కర్లేదు. నేను ఏమైనా కాపుల మద్దతు అడిగానా? నాకు కులమతాలు లేవు..’ ఇవీ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన మాటలు. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చేసరికి మాత్రం ఆయన ఏరికోరి కాపుల ఓట్లు గణనీయంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాలనే ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి 13 జిల్లాలున్న నవ్యాంధ్రలో ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించడం ఓ విచిత్రమైతే.. విశాఖ, ఆ పక్కనే ఉండే గోదావరి జిల్లాల నుంచే ఆ రెండు స్థానాలను ఎంపిక చేసుకోవడం పవన్‌కే చెల్లింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి తాను పుట్టిపెరిగిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి.. అలాగే పార్టీ ఆవిర్భావ సభ జరిగిన రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేశారు. కానీ పవన్ అటువంటి లెక్కలేమీ లేకుండా.. కేవలం కాపు కుల లెక్కల ప్రాతిపదికన సమీప జిల్లాల నుంచి పోటీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అనంత టు గాజువాక వయా లెక్కలేనన్ని స్థానాలు..: జనసేన సభలు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరిగితే.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ పవన్ గత ఆరు నెలలుగా చెబుతూ వచ్చారు. అనంతపురంలో పోటీ చేస్తానని ఓ సారి.. కాదు విజయవాడ సెంట్రల్ నుంచి అని మరోసారి.. ఏలూరు, పాడేరు నుంచి పోటీ చేయాలని ఉందని ఇంకోసారి.. ఇలా లెక్కలేనన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఆయన మనసు మాత్రం కాపు కుల లెక్కలవైపే ఉందనే విషయం ఇప్పుడు ఎంచుకున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాలను చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
గాజువాకలో ‘గబ్బర్’కు కష్టమే..: కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలోకి దిగుతున్న పవన్‌కు గెలుపు దక్కే అవకాశం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వారు గతంలో జరిగిన రెండు ఎన్నికలను ఉదహరిస్తున్నారు. 2009లో గాజువాక నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్, టీడీపీ, పీఆర్పీ.. చతుర్ముఖ పోటీ మధ్య పీఆర్పీ అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు. అయితే ఇక్కడ గెలిచిన వెంట్రామయ్య కంటే కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులకు కలిపి 13 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కేవలం కాంగ్రెస్ తరఫున రెబల్ అభ్యర్థి నిల్చోడంతో ఓట్లు చీలి ఆ ఎన్నికల్లో చింతలపూడి గెలుపొందారన్నది వాస్తవం. ఇక 2014 ఎన్నికకు వచ్చేసరికి చిరంజీవి తన సన్నిహితుడైన నటుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన జీవీ సుధాకర్‌నాయుడును కాంగ్రెస్ తరఫున పోటీ చేయించారు.
జీవీ కోసం చిరంజీవి స్వయంగా గాజువాక వచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. కానీ జీవీ కేవలం రెండున్నర వేల ఓట్లు కూడా సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున తిప్పల నాగిరెడ్డి బరిలో ఉండగా.. టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. తరతరాలుగా గాజువాక ప్రాంతంలో స్థిరపడ్డ తిప్పల కుటుంబానికి చెందిన నాగిరెడ్డికి కులమతాలకతీతంగా ప్రజలకు సేవలందించే మంచి మనిషిగా పేరుంది. ఇక టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్.. భూ దందాలు, సెటిల్‌మెంట్లతో ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థిగా పవన్ రంగంలోకి దిగినప్పటికీ.. స్థానిక, గత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థే ఇక్కడ గెలిచే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భీమవరంలోనూ అదే లెక్క..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పవన్ పోటీకి నిలవగా.. గత ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ కూడా ఆయనకు కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009లో భీమవరంలో చిరంజీవికి చెందిన ప్రజారాజ్యం పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అప్పట్లో పీఆర్పీ అభ్యర్థిపైనా కాంగ్రెస్ అభ్యర్థికి 23 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అంతెందుకు పక్క నియోజకవర్గం పాలకొల్లు నుంచి స్వయంగా చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణిపై దారుణంగా ఓడిపోయారు. కానీ పవన్ మాత్రం కాపుల ఓట్లన్నీ గంపగుత్తుగా తనకే వస్తాయన్న ధీమాతో బరిలోకి దిగారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. మూడో అభ్యర్ధిగా పవన్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ ముక్కోణపు పోటీలో కాపులతో పాటు నియోజకవర్గంలో కీలకమైన క్షత్రియ, మత్స్యకార, దళిత వర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. గ్రంథి శ్రీనివాస్‌కు ఆయా వర్గాల నుంచి పుష్కలంగా మద్దతు లభిస్తోంది. దీంతో ఇక్కడ కూడా ఆయన ‘లెక్క’ నిజమయ్యే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment