
సాక్షి, అమరావతి: జనసేన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, పార్టీ సంస్థాగత పటిష్టతకి కొంత సమయం పడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ అభిమానులతో వేర్వేరుగా ఆయన శనివారం విజయవాడలో సమావేశమయ్యారు. ఆయా సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే అందరూ బూత్ కమిటీల గురించే మాట్లాడుతూ, జనసేన పార్టీ బూత్ కమిటీలు ఎప్పుడు వేస్తోందంటూ తనను ప్రశ్నిస్తున్నారని, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు నిజమైన బూత్ కమిటీలు ఉన్నాయా? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు.
అందరికీ తెలిసినంత వరకు సీపీఐ, సీపీఎం, బీజేపీ లాంటి పార్టీలకు కొంతవరకు బూత్ కమిటీలు ఉన్నాయని, అలా ఉన్నప్పటికీ వారు ఎన్నికల్లో ఎందుకు గెలవడం లేదని ప్రశ్నించారు. మన అండతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గానీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ గానీ మనల్ని రాజకీయ పార్టీగా గుర్తించడానికి కూడా ఇష్టపడని రోజులు ఉన్నాయన్నారు. అటువంటి పార్టీలు ఇప్పుడు జనసేన మాతో కలసి వస్తుందని ప్రచారం చేసుకుంటున్నాయని చెప్పారు. వాళ్లకి మన అవసరం ఉందేమోగానీ మనకు మాత్రం వాళ్ల అవసరం లేదన్నారు.
60 శాతం కొత్త వ్యక్తులకే సీట్లు..
వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 60 శాతం మంది కొత్త వ్యక్తులకే సీట్లు ఇస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ప్రకాశం జిల్లా వంటి ప్రాంతంలో దీన్ని తు.చ. తప్పకుండా పాటిస్తామన్నారు. చిరంజీవి లాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అవినీతి అంతమవుతుందని ఆనాడు ప్రజలు ఆకాంక్షించారని, అయితే అది పక్కదారి పట్టిందని చెప్పారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలోకి ఎవరెవరో వచ్చారని, పార్టీ ఓడిపోగానే వెళ్లిపోయారన్నారు. దానివల్లే పార్టీ లక్ష్యం నీరుగారిపోయిందన్నారు. పీఆర్పీలోకి వచ్చిన వారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి ఒక బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారన్నారు. రాజకీయాలకు డబ్బు అవసరం లేదని రుజువు చేసిన మార్గదర్శి కాన్షీరాం అని, ఆయనే తనకు స్ఫూర్తి అని పవన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment