
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎంబీ భవన్‌లో పవన్ విలేకరులతో మాట్లాడారు. ‘ 2014 ఎన్నికల్లో 60 లేదా 70 స్థానాలకు పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పాను..మీరు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆ రోజు మాట్లాడింది వేరు మరుసటి రోజు వారి పేపర్లలో చంద్రబాబు రాయించింది వేరు. అప్పుడే చంద్రబాబుకు ఒక దండం పెడదాం అనుకున్నాను. తరవాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. నేను ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే నాకు కొన్ని సీట్లు వచ్చేవ’ ని పవన్ కల్యాణ్ అన్నారు.
తాను తెలుగుదేశం గురి మాట్లాడకుండా ఉంటే తనను టీడీపీ తొత్తు అన్నారు. మరి చంద్రబాబు, బీజేపీని ఏమీ అనడంలేదు..మరి ఆయన ఎవరి తొత్తు అని సూటిగా ప్రశ్నించారు. యూటర్న్ తీసుకున్నానని చంద్రబాబు, తనపై ఆరోపణలు చేయడం తగదని పవన్ అన్నారు. తెలుగు దేశం నాయకులు రాజధానిలో వేల ఎకరాల భూమిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం భూసేకరణ పేరుతో అడ్డగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
రైతులపై పీడీయాక్ట్, 144 సెక్షన్‌లు విధిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏపీలో నిరుద్యోగులకు జాబు మాత్రం రాలేదు గానీ వాళ్లబ్బాయి లోకేష్‌కు మాత్రం జాబ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎంబీభవన్‌లో పలువురు జనసేన పార్టీలో చేరారు. వారికి పవన్ కల్యాణ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.