విలేకరులతో మాట్లాడుతున్న ఎండీ ఇక్బాల్
సాక్షి, విజయవాడ : రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకి, నయవంచనకి మధ్య జరగబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ఎండీ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికలు మాట తప్పిన నాయకత్వానికి, సామాన్యులకు అండగా నిలిచే నాయకత్వానికి మధ్య జరగబోతున్నాయని అభివర్ణించారు. ప్రశ్నిస్తా అన్నవారు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలని పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు సూచించారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు.
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని, చంద్రబాబు నిర్ణయం జీవిత కాలం లేటని ఎద్దేవా చేశారు. ‘ప్రజల ఆకాంక్షలు ఫణంగా పెట్టారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు మీరు(చంద్రబాబు) హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తే టీడీపీ సహకరించలేదు. చంద్రబాబుది రైట్ టర్న్ కాదు, అబౌట్ టర్న్. బీజేపీ, టీడీపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు మొదటగా ప్రజలకు మౌళిక అవసరాలు తీర్చాలి. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజలను చేయలేరు. ప్రజలు వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నార’ని ఇక్బాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment