
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(పాత చిత్రం)
అమరావతి: వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తానేదో నియోజకవర్గానికి పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్దం చేశానని పవన్ కళ్యాణ్ అన్నారని విన్నాను..ఆ డబ్బులేవో ఉంటే ఆయన్నే తీసుకోమని చెబుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..‘అవినీతి లేకుండా ఉండటానికే పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పాను. ఇప్పుడు రెండువేల నోట్లు కూడా రద్దు చేయమని అడుగుతున్నా. అప్పుడు ఎన్నికల సమయంలో నోట్లు పంచే అవకాశం ఉండదు. విజయసాయి రెడ్డి ఇప్పటికీ తాను ప్రధాన మంత్రిని కలుస్తానని చెబుతున్నాడు. విజయసాయి రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో వాళ్లు లెక్కలు చెప్పాలి. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని చెప్పమనండి. ఈశాన్య రాష్ట్రాలకి పొడిగించారు’ అని అన్నారు.
‘అన్నింటిపైనా సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా బీజేపీ నేతలు. నిన్నటి వరకూ మాతో బాగానే ఉన్నారు. ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పోలవరం మీదా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయం వేరు అభివృద్ది వేరు. పోలవరం విషయంలో ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నానని తనపై దుష్ప్రచారం చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వమే నవయుగ కంపెనీని ఒప్పించింది. నవయుగ కంపెనీ కూడా మాకు మంచి పేరొస్తుందని పాత రేట్లకే ప్రాజెక్ట్ కట్టేందుకు ముందుకొచ్చారు’ అని వివరించారు.
పోలవరం ప్రాజెక్టును ఆపివేసేందుకు కుట్ర జరుగుతోందని, పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన మొత్తం తాను ఒప్పుకున్నానుని పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని వేల కోట్లు తాను చెల్లిస్తానని ఎలా చెబుతానని ప్రశ్నించారు. పదహారు ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం బ్రహ్మాండంగా నిధులు ఇస్తోందని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ నిజానికి ఏ ప్రాజెక్టుకు ఇంతవరకూ కేంద్రం నిధులు ఇవ్వలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment