పెండెం దొరబాబు
తూర్పుగోదావరి, పిఠాపురం: కోట్ల రూపాయల భక్తుల ఆస్తులపై కన్నేసిన టీడీపీ నేతలు సంస్థానంలో దొడ్డిదారిన అడుగుపెట్టి రెండేళ్లలో సుమారు రూ.50 కోట్లు దారి మళ్లించారని వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో అవినీతిపై విచారణ లేకుండా చేయడానికి ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఇక్కడ అవినీతి జరుగుతోందన్న ప్రచారం చేయించిన వర్మ తన అనుచరులను ట్రస్టు సభ్యులుగా వేయించి సంస్థానంలో తన హవా కొనసాగించారని ఆయన దుయ్యబట్టారు. ట్రస్టు సభ్యులైన తన అనుచరుల ద్వారా రూ.కోట్ల ఆస్తులను పక్కదారి పట్టించారని ఇటీవల తనకు వాటాలు రాకపోవడంతో పాటు అవినీతి బయటపడుతుందన్న భయంతో దేవాదాయ శాఖలో విలీనం చేసేలా పావులు కదిపారన్నారు.
అవినీతికి పాల్పడింది టీడీపీ నేతలే అయినా ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి, తమకు ఏపాపం తెలియదన్నట్టుగా నాటకాలాడారన్నారు. బోర్డు సభ్యులందరూ చేసిన అవినీతిని కొందరే చేసినట్లుగా చిత్రీకరించి మిగిలిన వారిపై అవినీతి పరులని ముద్ర వేసి వారి అంతు చూస్తానని ప్రకటనలు ఇచ్చి అవినీతిలో తనకు సంబంధం లేదన్నట్టుగా వర్మ డ్రామాలాడారని ఆయన తీవ్రంగా విమర్శించారు. తన అవినీతి కార్యక్రమాలకు అధికారులను బలి చేయడం వర్మకు అలవాటేనని ఇప్పటి వరకు ఎందరో అధికారులు బలి కాగా ఇప్పుడు సంస్థానం ఏఈఓను బలి చేశారన్నారు. అసలు రూ.9 కోట్లు అడ్డంగా దోచేశారని విలేకర్ల సమావేశంలో చెప్పిన వర్మ ఆ అవినీతి పరులపై విచారణ లేకుండా విచారణను పక్కదోవ పట్టించిన అధికారిపై విచారణ జరిపి అవినీతి దేశం నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆయన విమర్శించారు. కావాలనే విచారణను వాయిదాలు వేస్తూ అవినీతి పరులు సర్దుకోడానికి సమయం ఇస్తున్నారని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే న్యాయమూర్తితో విచారణ జరిపించి అవినీతి పరులను వెంటనే అరెస్టు చేయించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు భక్తుల మనోభావాలు దెబ్బతిన కూడదన్న కారణంగా ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదని ఆగామని కానీ అవినీతి పరులపై విచారణ జరిపితే తన బండారం బయటపెడతారన్న భయంతో విచారణను ఎమ్మెల్యే వర్మ పక్కదారి పట్టించడంతో తాము బయటకు రావాల్సి వచ్చిందన్నారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే అవినీతిపై విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment