తహసీల్దార్, సీఐతో చర్చిస్తున్న కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు
తూర్పుగోదావరి, గొల్లప్రోలు: మండలంలోని వైఎస్సార్ సీపీకి చెందిన 43మంది బూత్ కన్వీనర్లపై పోలీసు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పార్టీబూత్ కన్వీనర్లు 43 మంది పేర్లపై 1007 ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్‌లో తప్పుడు అభ్యంతరాలు నమోదయ్యాయి. ఆ అభ్యంతరాలకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులకు బూత్ కన్వీనర్లు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. అయినా తహసీల్దార్ ఫిర్యాదు చేశారని పిఠాపురం సీఐ సూర్య అప్పారావు, గొల్లప్రోలు ఎస్సై బి.శివకృష్ణ పార్టీ బూత్ కన్వీనర్లను పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విషయాన్ని తెలుసుకున్న దొరబాబు పార్టీ శ్రేణులతో కలసి తహసీల్దార్ వై.రవికుమార్‌ను కలుసుకుని కావాలని గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ బూత్ కన్వీనర్లు పేర్లపై ఓట్లు తొలగింపునకు ఆన్‌లైన్‌లో ఫారం–7 దరఖాస్తు చేశారన్నారు. దీనిపై ఇప్పటికే వారం రోజుల కిత్రం ఆర్‌ఓకు వినతి పత్రం ఇచ్చి, దోషులను గుర్తించాలని కోరానన్నారు. ఇప్పుడు కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బూత్‌కన్వీనర్లపై బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎక్కడా లేని విధంగా ఒక్క గొల్లప్రోలు మండలంలోనే కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగింపుకు ఆన్‌లైన్ ధరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులకు సమాచారమిచ్చామని, వారి విచారణలో నిందితులను గుర్తిస్తారని తహసీల్దార్ తెలిపారు.
మెయిన్‌రోడ్డుపై బైఠాయింపు
తహసీల్దార్ సమాధానంపై సంతృప్తి చెందిన పార్టీ నాయకులు దొరబాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మెయిన్‌రోడ్డుపై బైఠాయించారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న సీఐ సూర్య అప్పారావు సంఘటన స్థలానికి చేరుకుని దొరబాబుతో మాట్లాడారు. ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని , తహసీల్దార్ ఇచ్చిన పేర్లకు సంబంధించిన వారు రాతపూర్వకంగా సమాధానం ఇస్తే సరిపోతుందన్నారు. దీనిపై దొరబాబు మాట్లాడుతూ తమకు సంబంధం లేని విషయాన్ని పోలీస్‌స్టేషన్ వరకు తీసుకురావల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తహసీల్దార్‌కు ఇచ్చిన పత్రాలను మీరు తీసుకుని , విచారణ జరుపుకోవాలని కోరారు. అర్ధరాత్రి సమయంలో బూత్ కన్వీనర్ల ఇళ్లకు వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలని భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదన్నారు. దీంతో పోలీస్‌సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ ఓటమి భయంతోనే పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మొగలి బాబ్జీ, పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు పర్ల రాజా, అరిగెల రామయ్యదొర, బూత్‌కన్వీనర్లు దాసం లోవబాబు, కడిమిశెట్టి కుమారభాస్కరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment