
సాక్షి, కరీంనగర్ : ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లుంది మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిస్థితి. ముంచుకొస్తున్న ముందస్తు ఎన్నికల ప్రచారంలో రసమయి తీవ్ర నిరసనలకు గురువుతున్నారు. కాలుకు గజ్జెగట్టి ఆటపాటలతో ఉద్యమ సమయంలో జనాన్ని ఉర్రూతలూగించిన రసమయికి ఎన్నికల సమయంలో అదే జనం నుంచి నిరసన జ్వాలలు ఎదురుకావడంతో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కళాకారుడిగా జనం మెప్పుపొందిన రసమయి, ప్రజాప్రతినిధిగా జనం అభిమానాన్ని మాత్రం చురగొనలేకపొతున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ‘గోబ్యాక్ రసమయి’ అనే ప్లేకార్డులే దర్శనమిస్తున్నాయి.
ఇటీవల బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇల్లంతుకుంట మండలంలో పర్యటించిన అతనికి గ్రామస్తుల నుంచి ఊహించని వ్యతిరేకత ఎదురైంది. సొంత పార్టీకి చెందిన మహిళలే త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వ్యతిరేక పార్టీకి చెందిన వారి నుంచి ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ రసమయి మాత్రం సొంత పార్టీ కార్యకర్యల నుంచి తీవ్ర నిరసనలు చవిచూడాల్సి వస్తోంది. దళితులకు మూడెకరాల భూమి విషయంలో ఇటీవల బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు దళితులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరేపల్లి మోహాన్ ఎమ్మెల్యే తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నాలుగున్నరేళ్లు పదవిలో ఉండి నియోజకవర్గానికి కనీసం త్రాగునీరు కూడా అందించలేకపోయారని మండిపడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్‌పై 46 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వరాష్ట్రంలో తొలి తెలంగాణ సాంస్కృతిక సారధిగా నియమితులైయ్యారు. ఉద్యమ నాయకుడు కావడంతో గత ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించిన రసమయి.. ఈసారి గెలవడం అంత సులువైన విషయం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా తనను విమర్శించిన ఎంతటివారిపైనైనా నోరుపారేసునే తత్వం రసమయిది.
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుఫున బరిలో నిలిచిన ఆరేపల్లి మోహన్ మళ్లీ టిక్కెట్ తనకే తక్కుందని ధీమాతో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రత్యర్థి ఆరేపల్లి మోహన్ స్థానికుడు కావడం, రసమయి స్థానికేతరుడు కావడంతోపాటు ముక్కుసూటిగా మాట్లాడడంతోనే ముప్పువస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో నియోజకవర్గాన్ని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment