
’సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో టీఆర్‌ఎస్ అధినేత బహిరంగ సభ నిర్వహిస్తే జనం విరగబడ్డారు.. కానీ అభ్యర్థులు ర్యాలీలు చేపడితే ఇంటి బయటకు వచ్చి చూసేందుకు కూడా జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సదస్సు నిర్వహిస్తే ప్రాంగణంలో కుర్చీలు సరిపోక జనం వెలుపలి వరకు నిలబడి మైకు ద్వారా ఆమె మాటలు విన్నారు. ఇక్కడే అభ్యర్థులు పాదయాత్ర చేస్తే 50 మంది కూడా గుమికూడటం గగనంగా మారింది. హైదరాబాద్‌లో అభ్యర్థులు ప్రచార రథాల్లో తిరుగుతుంటే వెంట కార్యకర్తలు తప్ప సాధారణ జనం పోగవట్లేదు.
ఫలితాలను ప్రభావితం చేస్తుందా?: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు 6 రోజుల సమయమే మిగిలి ఉన్న తరుణంలో నెలకొన్న పరిస్థితి ఇది. ప్రచారానికి 4 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అసలు ఎన్నికల ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చూసీ చూడనట్లు పోతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తీరు పోలింగ్ రోజు చూపితే ఓట్లు రాక.. ఆశించిన ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముందని భయపడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు, అధినాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు స్పందన ఉన్నా.. అభ్యర్థులు పాదయాత్రకో, బైక్ ర్యాలీకో, ఇంటింటి ప్రచారానికో వస్తే ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు అభివాదం చేసేందుకు కూడా సాధారణ జనం లేని దుస్థితి కనిపిస్తోంది.
ఎందుకీ నిర్లిప్తత..
మన రాష్ట్రంలో చాలాకాలంగా జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకేసారి అసెంబ్లీ అభ్యర్థికి, లోక్‌సభ అభ్యర్థికి ఓటేసే పద్ధతి నడిచింది. ఈసారి అందుకు భిన్నంగా రెండు ఎన్నికలు విడివిడిగా వచ్చాయి. గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటును నిర్దేశించే అసెంబ్లీ ఎన్నికలంటే జనంలో తీవ్ర ఆసక్తి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినందున లోక్‌సభ ఎన్నికలు అనేసరికి ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్ననే కదా ఎన్నికల హడావుడి ముగిసింది.. మళ్లీ గోలేంటనే భావన వారిలో ఉందని పేర్కొంటున్నారు. స్థానిక అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యం లేని పార్లమెంటు ఎన్నికలంటే జనంలో అంతగా ఆసక్తి కనిపించట్లేదు.
అభ్యర్థుల్లో ఆందోళన..
జనంలో ఉన్న ఈ నిర్లిప్తత 11న జరగబోయే పోలింగ్‌పై ఉంటుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా భారీగానే పోలింగ్ నమోదైంది. కొన్ని జిల్లాల్లో 90 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ పోలింగ్ వల్ల ప్రధాన అభ్యర్థులందరిలో ఫలితాలపై ఆశలు నెలకొన్నాయి. ఈసారి ప్రచారానికి జనం స్పందించని తీరు చూస్తే పోలింగ్ తక్కువగా నమోదయ్యే ప్రమాదముందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విజయంపై తమకున్న ఆశలకు గండిపడుతుందన్నది భయపడుతున్నారు. ‘చాలా ప్రాంతాల్లో జనం సరిగా రావట్లేదు. అలాంటప్పుడు నాకు ఓటేస్తే ప్రయోజనమేంటో వారికి ఎలా చేరుతుంది.
వారు వచ్చి ఉంటే సానుకూల దృక్పథం వచ్చేది. రాకుంటే ఆ ప్రాంతంలో నాకు ఓటింగ్ తగ్గే ప్రమాదం ఉంది కదా’అని హైదరాబాద్ శివారులోని ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జాతీయ పార్టీ అభ్యర్థి ఆవేదన చెందారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మా మాటలను కొందరు పట్టించుకోలేదు. అప్పుడు మా హామీలు వారికి చేరలేదు. ఆ ఎన్నికల్లో మా అభ్యర్థి ఓడిపోయాడు. పోలింగ్ బాగా తక్కువగా నమోదవటమే దీనికి కారణమని అంతర్గత విశ్లేషణలో తేలింది. ఈసారి మా అభ్యర్థి జనంలోకి వెళ్తున్నాడు, కానీ జనం తక్కువగా వస్తున్నారు. మళ్లీ ఫలితం సానుకూలంగా వస్తుందో.. రాదో?’ఇదీ హైదరాబాద్‌లో పోటీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ముఖ్య అనుచరుడి ఆవేదన. దీంతో గత నాలుగైదు రోజులుగా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా కోరుతుండటం విశేషం.
జనం డిసైడ్ అయ్యారా..
లోక్‌సభ ఎన్నికల్లో స్థానిక అంశాలకు అంత గా ప్రాధాన్యం ఉండదు. ఇది ముఖ్యమంత్రిని నిర్దేశించే ఎన్నికలు కావు. ప్రధాని ఎవరుండాలనే విషయాన్ని తేల్చే ఎన్నికలు. ఈ విషయంలో ఇప్పటికే విద్యాధికులు, రాజకీయంగా అవగాహన ఉన్నవారు ఓ నిర్ణయానికి వచ్చారన్నది విశ్లేషకుల మాట. ‘ప్రధానిగా మోదీ పనితీరు చూశారు. రాహుల్ గాంధీ వస్తే ఎలా ఉంటుందనే విషయంలో కొంత అంచనాకు వచ్చి ఉంటారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందనే విషయంలో చర్చలు విని ఉంటారు.
వెరసి ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారికి ఈ ప్రచారంతో సంబంధం లేదు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మంచి పోలింగ్ నమోదు కావొచ్చు’అని ఓ రాజకీయ విశ్లేషకుడు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్, దాని చుట్టు పక్కల మాత్రమే తక్కువగా పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పోలింగే నమోదైంది. కానీ ఈసారి హైదరాబాద్ సహా దాదాపు అన్ని చోట్లా ప్రచారంలో జనం స్పందన ఒకే రకంగా ఉంటుండటం ఆశ్చర్యపరుస్తోంది. నిర్లిప్తంగా వ్యవహరించే తీరు ఎక్కువగా నగరాల్లో చూస్తుంటాం. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రచారానికి జనం పెద్దగా స్పందించకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment