అందరివాడివనీ.. ఆదుకుంటావనీ.. | Peoples Request To YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

అందరివాడివనీ.. ఆదుకుంటావనీ..

Published Thu, Jul 19 2018 9:54 AM | Last Updated on Thu, Jul 19 2018 9:54 AM

Peoples Request To YS Jagan Mohan Reddy - Sakshi

కాకినాడలో జనవాహినికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఉభయ కుశలోపరి.. ఎన్ని మనసులు గెలుచుకున్నారో.. ఎన్ని హృదయాల్లో కొలువై ఉన్నారో.. బుధవారం నాటి కాకినాడ బహిరంగ సభకు జనసాగరమే కదలివచ్చిందా అనిపించింది. మహానేత తనయుడు.. తండ్రి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా అభిమానాన్ని చూరగొన్నారు. ఏ కష్టమొచ్చినా ఆయనతో చెప్పుకొంటే సమస్య పరిష్కారమవుతుందని నమ్మకం. ఆయన ఒక్క అడుగు వేస్తే అనుసరించడానికి కొన్ని వేల అడుగులు సిద్ధపడుతున్నాయి. ‘నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది’ అని జనం.. ‘మీ సంతోషం.. శ్రేయస్సు.. సంక్షేమం నాది’ అని జగన్‌.. పరస్పరం ఒకే భావనతో ముందుకు సాగిపోయారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్ర కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడ నుంచి కాకినాడ సిటీ నియోజకవర్గం ఆదిత్య సెంటర్‌ వరకు సాగింది.

తల్లితండ్రులు లేరని పట్టించుకోవడం లేదన్నా
‘చిన్నప్పుడే మా తల్లి తండ్రులు చనిపోవడంతో నేను, నా చెల్లి అనాథలుగా ఉంటున్నామ’ని వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కాకినాడ రూరల్‌ చీడిగకు చెందిన పెదపాటి మల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీడిగలో వైఎస్‌ జగన్‌ వద్ద సమస్యను వివరించి కన్నీరుమున్నీరైంది. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ తన చెల్లెలు మానసిక వికలాంగురాల ని, నిరుపేద కుటుంబానికి చెందినవారమని వాపోయింది. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో పరాయి పంచన తలదాచుకోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. నివసించేందుకు ఇళ్ల స్థలం ఇప్పించాలని నాలుగేళ్ల నుంచి జన్మభూమి కమిటీల్లో దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు పంచాయతీ, రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియపరిచినా పట్టించుకోవడం లేదన్నారు. మీకు తల్లితండ్రులు లేరని, వయసు తక్కువ కావడంతో ఇంటి స్థలమే కాదు, ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తించవని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాలాంటి నిరుపేదలను ఆదుకోవాలని జగన్‌కు విజ్ఞప్తి చేసింది.

గగనంలో గాలి పంకాలు..
రివ్వున తిరిగే పంకా చల్లని గాలినిస్తుంది. పార్టీ గుర్తు కూడా.. సమస్యల వేడిలో ఓదార్పునిచ్చిన వాడు చల్లని నాయకుడవుతాడు. అంతటి నాయకుడికి స్వాగతం పలికేందుకు కాకినాడ రూరల్‌ గ్రామంలో వేలాడుతున్న పంకాలను స్వాగత ద్వారాలు అమర్చారు. పాదయాత్రికులను ఈ స్వాగత ప్రక్రియ విశేషంగా ఆకర్షించింది. పాదయాత్రగా వచ్చిన జగన్‌కు కాకినాడ, కాకినాడ రూరల్‌ గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది.   

బెల్టు షాపులను నిర్మూలించయ్యా..!
‘‘వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బెల్టు షాపులను నిర్మూలించడయ్యా’’ అంటూ ఇంద్రపాలేనికి చెందిన వాసంశెట్టి రమణమ్మ జగన్‌ను కోరింది. తన ఇద్దరు పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారని, భర్త తాపీ పని చేస్తుండగా వచ్చిన కూలి సొమ్ములో సగం మద్యం సేవించేస్తున్నాడని వాపోయింది. విచ్చలవిడిగా ఉన్న బెల్టుషాపుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని, సంపూర్ణంగా వీటిని నిర్మూలించాలని కోరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement