సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ప్రజల్లో ఆయనకు అంతపేరు ప్రఖ్యాతలు ఉంటే.. ఆయనే సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేయాలన్నారు. పార్టీని కాకుండా తనను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన రోజు గోడ ఎందుకు దూకారో మోదీకి చెప్పాలన్నారు. తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కష్టంతోనే గెలిచామని మంత్రి పేర్కొన్నారు. తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘురామకృష్ణంరాజు పప్పులు ఇక్కడ ఉడకవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు : మంత్రి శ్రీరంగనాథరాజు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కేబినెట్‌లో చోటు కల్పించారని ప్రశంసించారు. ఎంపీ రఘురామకృషంరాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదు
వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేశారు కాబట్టే రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. రఘురామ కృష్ణంరాజు ఏ మాత్రం పద్దతిగా మాట్లాడడం లేదని విమర్శించారు. నరసాపురంలో ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదని ఎద్దేవా చేశారు.
రఘురామకృష్ణంరాజు గతం మర్చిపోయారు: ఎమ్మెల్యే గ్రంధి
ఎంపీ రఘురామకృషంరాజు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. గతంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, జిల్లా నేతలంతా సీఎం జగన్‌ను కలిసి విన్నవిస్తే.. రఘురామకృష్ణంరాజును మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఆయన ఎంపీగా గెలిచారన్నారు. టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారిన వ్యక్తి .. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment