
‘చిన్నప్పటి నుంచి నాకు పైలెట్ కావాలని కోరిక ఉండేది. ఆ కోరికను నెరవేర్చుకున్నా. కానీ, ఎక్కువ కాలం పైలెట్‌గా పనిచేయలేదు. ఆ ఉద్యోగం వీడినా నా ఇంటిపేరు ‘పైలెట్’గానే నిలిచిపోయింది’ అని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి చెప్పారు. తన నాన్న, బాబాయ్‌లను చూసి రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల మధ్య ఉండడం ఇష్టమని ఆయన వెల్లడించారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుంటుంబ విశేషాలను వివరించారు.
తాండూరు: మాది బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామం. నాన్న విఠల్‌రెడ్డి, అమ్మ ప్రమోదినిదేవి. అమ్మ చిల్కూరు గురుకుల విద్యాలయంలో ఫిజికల్ డైరక్టర్‌గా పనిచేసి రిటైర్మెంట్ అయింది. నాన్న రాజకీయాల్లో ఉన్నారు. గ్రామంలో మా తాత పంజుగుల లింగారెడ్డిది ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ కుటుంబమంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటాం. ఎలాంటి నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకుంటాం. నేను ప్రాథమిక విద్య, ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. స్వీడన్‌లోని బీటీహెచ్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు స్వీడన్‌కు వచ్చిన విద్యార్థులకు నేను కోఆర్డినేటర్‌గా కొనసాగాను.
పైలెట్ కావాలని కోరికతో..
పైలెట్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం అమెరికాకు వెళ్లి కాలిఫోర్నియాలో పైలెట్ కోర్సులో చేరాను. ఏడు నెలల పాటు పైలెట్ శిక్షణ పొందాను. శిక్షణ పూర్తికాగానే ఆరు నెలల పాటు అక్కడే పైలెట్‌గా పనిచేశాను. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి బిజినెస్‌పై ఆసక్తి చూపించాను. అయితే, నేను పైలెట్ వృత్తి మానేసినా నా ఇంటిపేరు మాత్రం ‘పైలెట్’గానే నిలిచిపోయింది.
పెద్దలు కుదిర్చిన వివాహం
మా మామ స్వస్థలం విశాఖపట్నం. వారి కుటుంబం కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటోంది. నా పెళ్లిచూపులు చెన్నైలోనే జరిగాయి. మా పెళ్లి నిడారంబరంగా తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో జరిగింది. నా భార్య ఆర్తి కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. కూతురు నక్షత్ర, కుమారుడు జయదేవ్‌రెడ్డిలు పుట్టగానే మాకు కలిసొచ్చింది. నా కొడుకు పుట్టిన రోజే తాండూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నేను ఎప్పటికీ మరిచిపోని రోజు.
రజనీకాంత్‌తో పరిచయం ఇలా..
సూపర్‌స్టార్ రజనీకాంత్, మా మామ విక్టర్ ప్రసాద్ ప్రాణ స్నేహితులు. నా భార్య ఆర్తితో కలిసి ఎప్పుడు చెన్నైకి వెళ్లినా రజనీకాంత్‌ను కలుస్తాను. నిరాడంబరంగా జీవిస్తున్న వారిలో రజినీకాంత్ ఒక్కరినే చూశాను.
రాజకీయాలపై ఆసక్తి ఇలా..
కుటుంబంలో నాన్న విఠల్‌రెడ్డి, బాబాయ్ శ్రీశైల్‌రెడ్డిలు రాజకీయాలలో ఉన్నారు. వారిని చూసి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాను. అప్పటి నుంచి తాండూరు ఎమ్మెల్యే కావాలని కోరిక పుట్టింది. అందుకోసం పదేళ్ల పాటు రాజకీయాలలో కొనసాగాను. ఇటీవల జరిగిన ఎన్నికలలో తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించాను.
నాకు ఇష్టమైనవి ఇవీ..
క్రికెట్ ఆడటమంటే ఎంతో ఇష్టం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడాను. రంజీ సెలక్షన్ వరకు వెళ్లి తర్వాత మధ్యలో వదిలేశాను. వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ చూస్తాను. నాకు ఇష్టమైన టూరిస్ట్ స్పాట్ కాలిఫోర్నియా, కశ్మిర్. కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్తాను. సినిమా హీరోలలో చిరంజీవిని ఇష్టపడతాను. ఇటీవల కాలంలో నేను జెర్సీ సినిమాను చూశాను.
రోహిత్‌కు భార్య కావడం నా అదృష్టం
రోహిత్‌రెడ్డి నా జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఆయన బిజినెస్, రాజకీయాలలో బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆయనకు నాన్‌వెజ్ చేసి పెట్టడమంటే నాకేంతో ఇష్టం. రోహిత్ మనసు తెలుసుకొని మసలుకుంటాను. – ఆర్తిరెడ్డి, రోహిత్‌రెడ్డి భార్య

పిల్లల బర్త్‌డే వేడుకల్లో రోహిత్‌రెడ్డి కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment