
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లే ఆర్థిక ప్యాకేజీలో మార్పులు చేశామని కేంద్రం తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారని గుర్తుచేశారు. తదుపరి ప్యాకేజీలో మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సూచనలు అందాయని అన్నారు. అందుకు అనుగుణంగా మార్పులు చేసి 2017లో ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. దీనికి ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు 2017 మే 2వ తేదీన ఆర్థిక మంత్రికి లేఖ కూడా రాశారని తెలిపారు.
ఆర్థిక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులను ఆయన వివరించారు. ‘1. కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగానే విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టే ప్రాజెక్ట్(ఈఏపీ)లకు సైతం కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్రం వాటా 10 శాతం కింద సాయం చేయాలి. 2. ఇతర ఈఏపీలు, చిన్న మొత్తాల పొదుపు, నాబార్డు నుంచి అప్పటికే పొందిన రుణాల తిరిగి చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలి. 3. దేశీయ ఆర్థిక సంస్థలైన నాబార్డ్, హడ్కో ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి అనుమతించాలి. 4. కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి పొందిన అప్పులపై వడ్డీ చెల్లించడానికి విరామం పొందే వీలు కల్పించాలి. 5. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక ఆర్థిక సాయం చర్యలను రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి చేర్చకూడదు’ అనే ఐదు అంశాలతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి మార్పులు చేశామని పేర్కొన్నారు. అనంతరం ప్యాకేజీకి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ప్రకటించిన ప్యాకేజీ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈఏపీ ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఏపీ పొందిన రుణాలకు వడ్డీ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వమే జరుపుతుందని మంత్రి పేర్కొన్నారు.