సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావాలని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కేడర్‌తో ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడుతూ వలస కార్మికులను ఆదుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉండాలనుకునే వలస కూలీలకు ఆహారం, నివాసం ఏర్పాట్లు చేయాలని, వెళ్లిపోవాలనుకునే వారికి ప్రభుత్వం వసూలు చేస్తున్న రైలు ఖర్చులను కాంగ్రెస్ కేడరే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలమైందని, అసలు ఎంత మంది వలస కూలీలున్నారో లెక్క కూడా ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలస కూలీల విషయంలో సీఎం ఒక లెక్క చెబితే మంత్రులు మరో లెక్క చెప్తున్నారంటే వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. వలస కార్మికుల విషయంలో రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు చేసిన కృషిని ఏఐసీసీ కూడా గుర్తించిందని ఉత్తమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment