లోక్‌సభలో గొడవ చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన కుట్ర ఆరోపణల నేపథ్యంలో వరుసగా మూడో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు మోదీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. ఆ సమయంలో మోదీ సభలోనే ఉన్నారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి జీరో అవర్‌తో ప్రారంభమయింది. నిరసన కొనసాగించిన కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. తమ నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయగా స్పీకర్ స్పందించలేదు. తర్వాత కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి.. మన్మోహన్‌కు వ్యతిరేకంగా ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరగా స్పీకర్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులువాకౌట్ చేశారు.
ప్రధాని క్షమాపణ చెప్పరు:
మోదీ ఆరోపణలకు నిరసనగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. బుధవారం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చి గొడవ చేయటంతో చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. సభ లోపల ఆరోపణలు చేయనందున ప్రధాని క్షమాపణలు చెప్పబోరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన తీవ్రతరం కావటంతో సభ గురువారానికి వాయిదా పడింది
► అటవీ చెట్ల జాబితా నుంచి వెదురును తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు, దేశ భద్రత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన స్థిరాస్తి బిల్లుల సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment