గురుపౌర్ణమి సందర్భంగా ఢిల్లీలో శ్రీ పేజవర మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీతో మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని, రోస్టర్ విధులను సరిగా నిర్వర్తించని కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని కేంద్ర మంత్రుల జాబితాను ఏరోజుకారోజు సాయంత్రానికల్లా తనకు ఇవ్వాలని మోదీ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడాలని మోదీ సూచించారు. క్షేత్ర స్థాయి అధికారులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. టీబీ, క్షయ వంటి వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
నీటి, జంతు సంరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతోన్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీలను ఆదేశించారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రధానికి తెలిపారు. కాగా, పార్లమెంటు సమావేశాలకు ఎంపీల గైర్హాజరుపై ఇటీవల జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలోనూ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment