అక్లజ్‌లో మోదీని సత్కరిస్తున్న బీజేపీ కార్యకర్త
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందనడం ద్వారా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రివర్స్ స్వింగ్‌తో భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ప్రధాని మోదీ అన్నారు.‘ఇమ్రాన్ ఖాన్ మంచి క్రికెటర్ అన్న సంగతి మనం మరిచిపోకూడదు. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్య భారత్‌లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి రివర్స్ స్వింగ్‌లో చేసిన ప్రయత్నమని గుర్తించాలి. అయితే, రివర్స్ స్వింగ్‌లో వచ్చే బంతిని హెలికాప్టర్ షాట్‌తో ఎలా కొట్టవచ్చో భారతీయులకు బాగా తెలుసు’ అని క్రికెట్ పరిభాషలో మోదీ స్పందించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలక సమస్యలను పక్కన పెట్టి జాతీయవాదాన్ని అతిగా చూపిస్తోందంటూ వస్తున్న విమర్శకు ఆయన బదులిస్తూ, తన ప్రసంగాల్లో చాలా భాగం అభివృద్ధికి సంబంధించిన విషయాలే ఉంటున్నాయని, అయితే, అవి మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం లేదని అన్నారు. సాయుధ దళాలను రాజకీయమయం చేస్తున్నారన్న ఆరోపణను కూడా ఆయన తోసిపుచ్చారు.
సైన్యం తిరుగుబాటు చేసిందంటూ వారు తప్పుడు వార్తను ప్రచారం చేసినప్పుడే సైన్యాన్ని రాజకీయమయం చేయడం జరిగిందన్నారు. దేశభక్తి వ్యాధేమీ కాదని ప్రధాని ఉద్ఘాటించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పలితాల గురించి మాట్లాడుతూ, అక్కడి ప్రజలు దేశానికి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఓటేస్తారని, కుటుంబానికి ప్రాదాన్యమిచ్చే వారికి కాదని మోదీ అన్నారు.యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి వ్యక్తిగత ప్రయోజనాలు, మనుగడ కోసం ఏర్పడిందేనన్నారు. యూపీ ప్రజలు దార్శనికతకే(విజన్) ఓటు వేస్తారు కాని విభజనకు(డివిజన్) కాదన్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలు దేశాన్ని మళ్లీ అవినీతి, దోపిడీ శకంలోకి తిరోగమింపచేయాలని చూస్తున్నాయన్నారు.
మొత్తం సామాజిక వర్గాన్నే దొంగల్ని చేశారు
అక్లజ్: ‘ఈ దొంగలందరి పేర్లూ మోదీయే ఎందుకయ్యాయో’ అని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మొత్తం మోదీ సామాజిక వర్గాన్నే కించపరిచారని మోదీ ఆరోపించారు.‘వెనకబడిన కులానికి చెందిన నన్ను దూషించేందుకు వాళ్లు ఎప్పుడూ వెనకాడలేదు. ఇప్పుడు హద్దులు మీరారు. మోదీ సామాజిక వర్గం మొత్తాన్నే కించపరిచారు’ అంటూ మహారాష్ట్రలోని అక్లజ్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని ధ్వజమెత్తారు. శరద్ పవార్ తనకంటే పెద్దవాడు కాబట్టి తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడే అధికారం ఆయనకు ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే నదుల అనుసంధానం, నీటిపారుదల వ్యవహారాలు చూడటం కోసమే ప్రత్యేకంగా జలశక్తి మంత్రిత్వ శాఖను నెలకొల్పుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తనను గద్దెదింపడం తప్ప కాంగ్రెస్, ఎన్‌సీపీలకు దేశంపై తపన లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment