సాక్షి, చెన్నై: చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డీఎంకే అధినేత కరుణానిధిని ప్రత్యేకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం చెన్నై గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లిన మోదీ ఆయనను పరామర్శించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపింది. 2014 ఎన్నికల అనంతరం ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. చెన్నైలో మోదీ రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారని సోమవారం బీజేపీ ప్రకటించింది. కరుణను కలుస్తారని కాసేపటికి బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ట్వీట్ చేశారు.
మధ్యాహ్నం కరుణ నివాసానికి మోదీ చేరుకోగానే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళి, సీనియర్ నేత దురై మురుగన్ ఆహ్వానం పలికారు. మోదీ లోపలికి వెళ్లి కరుణానిధిని పలకరించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మోదీకి పుస్తకాన్ని కరుణ కానుకగా ఇచ్చారు. దాదాపు 20 నిమిషాలు ప్రధాని అక్కడ గడిపారు. ‘తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధిని కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను’ అని తర్వాత ట్వీటర్‌లో మోదీ వెల్లడించారు. భారత రాజకీయాల్లో కరుణానిధి చాలా సీనియర్ నేతని, ఆయన పట్ల మోదీకి చాలా గౌరవం ఉందని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ పేర్కొన్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, గతంలో ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడూ సమావేశాల్లో పలకరించుకునేవారని ఆయన పేర్కొన్నారు.
‘కరుణానిధిని ప్రధాని మోదీ మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి వాకబు చేయడంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు’ అని తన ట్విటర్ పేజీలో స్టాలిన్ పేర్కొన్నారు. ఈ భేటీ గురించి స్టాలిన్‌కు ముందుగానే తెలుసని, అందుకే దుబాయ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని ఆయన చెన్నైకి హుటాహుటిన వచ్చినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాట అన్నాడీఎంకేకు పట్టు తగ్గిందని, తదుపరి ఏ ఎన్నికలు వచ్చినా డీఎంకేదే ఆధిపత్యమని.. ఈ నేపథ్యంలో మోదీ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్దిరోజుల్లో అవినీతి కేసుల్లో డీఎంకే నేతలపై తీర్పు వెలువడనున్న వేళ.. ఈ భేటీపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment