dmk karunanidhi
-
కరుణతో ప్రధాని భేటీ
సాక్షి, చెన్నై: చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డీఎంకే అధినేత కరుణానిధిని ప్రత్యేకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం చెన్నై గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లిన మోదీ ఆయనను పరామర్శించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపింది. 2014 ఎన్నికల అనంతరం ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. చెన్నైలో మోదీ రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారని సోమవారం బీజేపీ ప్రకటించింది. కరుణను కలుస్తారని కాసేపటికి బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ట్వీట్ చేశారు. మధ్యాహ్నం కరుణ నివాసానికి మోదీ చేరుకోగానే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళి, సీనియర్ నేత దురై మురుగన్ ఆహ్వానం పలికారు. మోదీ లోపలికి వెళ్లి కరుణానిధిని పలకరించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మోదీకి పుస్తకాన్ని కరుణ కానుకగా ఇచ్చారు. దాదాపు 20 నిమిషాలు ప్రధాని అక్కడ గడిపారు. ‘తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధిని కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను’ అని తర్వాత ట్వీటర్లో మోదీ వెల్లడించారు. భారత రాజకీయాల్లో కరుణానిధి చాలా సీనియర్ నేతని, ఆయన పట్ల మోదీకి చాలా గౌరవం ఉందని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ పేర్కొన్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, గతంలో ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడూ సమావేశాల్లో పలకరించుకునేవారని ఆయన పేర్కొన్నారు. ‘కరుణానిధిని ప్రధాని మోదీ మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి వాకబు చేయడంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు’ అని తన ట్విటర్ పేజీలో స్టాలిన్ పేర్కొన్నారు. ఈ భేటీ గురించి స్టాలిన్‌కు ముందుగానే తెలుసని, అందుకే దుబాయ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని ఆయన చెన్నైకి హుటాహుటిన వచ్చినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాట అన్నాడీఎంకేకు పట్టు తగ్గిందని, తదుపరి ఏ ఎన్నికలు వచ్చినా డీఎంకేదే ఆధిపత్యమని.. ఈ నేపథ్యంలో మోదీ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్దిరోజుల్లో అవినీతి కేసుల్లో డీఎంకే నేతలపై తీర్పు వెలువడనున్న వేళ.. ఈ భేటీపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. -
మాకేంటి సంబంధం!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలోని తమ ప్రభుత్వానికి సంబంధం ఏమిటో అని కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ప్రశ్నించారు. తమ మీద నిందల్ని వేసే విధంగా డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్లే ఆ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చిందన్న విషయం జగమెరిగిన సత్యంగా వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగిన బహిరంగ సభలో డీఎంకే అధినేత కరుణానిధి కేంద్రాన్ని టార్గెట్ చేసి పరోక్షంగా స్పందించారు. ప్రధానంగా ఎన్నికల ఫలితాల లెక్కింపు సమయంలో పీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ కారణంగా తమ వాళ్లు అనేక చోట్ల స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని, ఇందులో పెద్ద కుట్రే జరిగిందంటూ పరోక్షంగా స్పందించడం కమలనాథుల్లో ఆగ్రహాన్ని రేపాయి. ఈ విషయంగా మంగళవారం మీడియాతో కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో, కేంద్రప్రభుత్వం, ప్రధాని కార్యాలయానికి సంబంధం ఏమిటో అంటూ కరుణానిధి వ్యాఖ్యల్ని ఖండిం చారు. కుట్రలు, కుతంత్రాలు చేయాల్సిన అవ సరం తమకు లేదని స్పష్టం చేశారు. ఎవరికో అధికార పగ్గాల్ని అప్పగించాల్సినంతగా వ్యవహరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. డీఎంకే వర్గాల్లో పలువురు కారణం అన్నట్టుగా కూడా కరుణానిధి స్పందించినట్టున్నారే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ, ఆయన ఆరోపణలు గుప్పించి ఉండడంలో వాస్తవాలు లేవని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్ని ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యల మధ్య నిర్వహించిందని వివరించారు. డీఎంకే చేతికి అధికారం దక్కకుండా పోవడానికి కారణం, ఆ కూటమిలో కాంగ్రెస్‌ను ఆహ్వానించడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మీద తమిళనాట తీవ్ర ఆక్రోశం రగులుతున్న నేపథ్యంలో వారిని అక్కున చేర్చుకుని చేజేతులా అధికారాన్ని దూరం చేసుకుంది కాకుండా, నిందల్ని ప్రధాని కార్యాలయం మీద నెట్టేందుకు యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
కరుణకే పట్టం
కరుణానిధికే డీఎంకే మరోసారి పట్టం కట్టింది. డీఎంకే అధ్యక్షునిగా కరుణానిధి 11వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్బగళన్, కోశాధికారిగా స్టాలిన్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల అధికారి సద్గుణ పాండియన్ ప్రకటించారు. ⇒ డీఎంకే అధ్యక్షునిగా కరుణ 11వ సారి ఎన్నిక ⇒ కనిమొళికి మహిళా పగ్గాలు ⇒ బీజేపీని నమ్మవద్దని కరుణ ఉద్బోధ చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో డీఎంకే సంస్థాగత ఎన్నికలు నెల రోజులుగా సాగుతున్నాయి. పార్టీ పరమైన 65 జిల్లాలకుగానూ 60 జిల్లాల్లో ఎన్నికలను పూర్తి చేశారు. ఇక పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్థానాలకు కరుణానిధి, అన్బళగన్, స్టాలిన్ రెండు రోజుల క్రితం నామినేషన్లు వేశారు. ఈ నెల 9న సర్వసభ్య సమావేశం నిర్వహించి ఎన్నికైన వారి వివరాలను వెల్లడిస్తామని పార్టీ ఎన్నికల అధికారి ప్రకటించారు. నగరంలోని డీఎంకే కార్యాలయమైన అన్నా అరివాలయంలో శుక్రవారం ఉదయం సమావేశం జరిగింది. సుమారు 2500 మంది సర్వసభ్య సమా వేశానికి హాజరయ్యారు. తొమ్మిది గంటలకు కరుణానిధి, అన్బగళన్, స్టాలిన్ వచ్చారు. ప్రధానమైన మూడు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైనందున కరుణ, అన్బళగన్, స్టాలిన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ ఎన్నికల అధికారి సద్గుణ పాండియన్ ప్రకటించారు. తర్వాత ముగ్గురు నేతలు వేదికపైకి రాగా పార్టీ నేతలు వారిని సత్కరించారు. స్టాలిన్ సమర్థుడు: కరుణ తొంభై ఏళ్లు పైబడిన కరుణకు పార్టీ అధ్యక్షుని హోదాలో వారసుడు ఎవరనే చర్చకు శుక్రవారం నాటి సర్వసభ్య సమావేశంలో దాదాపు తెరపడింది. ‘పార్టీని ఎలా నడిపించాలి, నేతలను ఎ లా కలుపుకుపోవాలి, సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి సమన్వయం పాటించాలి అనే అంశా ల్లో స్టాలిన్ ఎంతో సమర్థుడు అనే విషయాన్ని తాను ఏడు నెలల క్రితమే చెప్పాను. పార్టీ సంస్థాగత ఎన్నికలను నడిపిన తీరుతో స్టాలిన్ తన సమర్థతను నిరూపించుకున్నాడు’ అంటూ కరుణానిధి తన చిన్నకుమారుడుని ప్రశంసంలతో ముంచెత్తారు. తద్వారా పార్టీకి వారసుడు స్టాలిన్ మాత్రమేనని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పరాయి వారితో జాగ్రత్త: రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కొందరు పరాయి వ్యక్తులు పావు లు కదుపుతున్నారని, వారితో జాగ్రత్తగా ఉండండని పార్టీ నేతలను కరుణానిధి హెచ్చరించారు. ఎక్కడి నుంచో వచ్చి చెన్నైలో మీటింగులు పెట్టుకుంటారు, వారి చూపంతా డీఎంకేపైనే ఉందని పరోక్షంగా బీజేపీ అధ్యక్షులు అమిత్‌షాను విమర్శించారు. డీఎంకేను కాలరాయాలని ఎందరో ప్రయత్నా లు చేసి కాలగర్భంలో కలిశారని, తమ పార్టీ ఎవ్వరికీ మింగుడు పడదని, మరెవ్వరికీ తలొగ్గదని ఆయన అన్నారు. అంతేగాక జయలలిత చేత వంచనకు గురైన వారు సైతం డీఎంకే వైపు అడుగులు వేస్తున్నారు, వారి పట్ల సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఎప్పటికీ చేజార్చుకోమన్నారు. త్వరలో పార్టీ అనుబంధ శాఖల అధ్యక్షులను నియమిస్తామని స్టాలిన్ ప్రకటించారు. అధికార పార్టీపై ధ్వజం:పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే పాలనపై నేతలంతా ధ్వజ మెత్తారు. 2011లో జయ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అవినీతి, కుంభకోణాలు, శాంతిభద్రతల సమస్య ఎక్కువైందన్నారు. రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి (జయలలిత)కి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమాన పడడం ఇదే ప్రథమమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బినామీ ముఖ్యమంత్రి పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం తీరును నిరసిస్తూ పార్టీ త్వరలో నగరంలో ర్యాలీని నిర్వహించి గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని సమావేశంలో తీర్మానించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కరుణ తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళిని నియమించాలని నిర్ణయించారు. -
నాగపట్నం నాయకుడెవరు?
సాక్షి, చెన్నై : ఉప్పు ఉత్పత్తికి, చేపల పరిశ్రమకు కేంద్రంగా, నాగూర్ దర్గా, వేలాంగని మేరీ మాత ఆలయం, శింగార వేలర్, సుందరరాజస్వామి, నీలాదిలక్ష్మి, నీలకరై మారి యమ్మ వంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయంగా నాగపట్నం ప్రఖ్యాతి గాంచింది. పర్యాటకంగా అభివృద్ధి దిశలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఈ నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. రిజర్వుడు స్థానంగా ఉన్న నాగపట్నానికి నాయకుడు తామే కావాలన్న లక్ష్యంతో రాజకీయ పక్షాల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అసెంబ్లీ స్థానాలు : పునర్విభజనానంతరం వేదారణ్యం, తిరువారూర్, నన్నిలం, నాగపట్నం, తిరుత్తురైపూండి, కీళ్ వేలూర్ అసెంబ్లీ స్థానాలతో కొత్త పుంతలు తొక్కుతూ నాగపట్నం లోక్‌సభ రూపుదిద్దుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వేదారణ్యం నుంచి ఎన్వీ కామరాజ్(అన్నాడీఎంకే), నన్నిలం నుంచి ఆర్ కామరాజ్(అన్నాడీఎంకే), నాగపట్నం నుంచి కేఏ జయపాల్(అన్నాడీఎంకే), కీళ్ వేలూర్ నుంచి పీ మహాలింగం అలియాస్ వీపీ నాగమలై(సీపీఎం), తిరువారూర్ - ఎంకే కరుణానిధి(డీఎంకే), తిరుత్తొరై పూండి నుంచి కె ఉలగనాథన్(సీపీఐ) గెలిచారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్వగ్రామం తిరువారూర్ ఈ లోక్‌సభ పరిధిలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున ఆయనొక్కరే గెలిచారు. మిగిలిన ఐదు స్థానాలను అన్నాడీఎంకే కూటమి దక్కించుకుంది. అయితే, సీపీఎం, సీపీఐలు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన దృష్ట్యా, ప్రస్తుతం ఆ పార్టీ ఖాతాలో మూడు స్థానాలే ఉన్నాయి. ఓటర్లు: ఈ లోక్‌సభ పరిధిలో 11 లక్షల 88 వేల 738 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఐదు లక్షల 96 వేల 019 మంది పురుషులు, ఐదు లక్షల 92 వేల 712 మంది స్త్రీలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సార్లు, కమ్యూనిస్టులు ఐదు సార్లు, డీఎంకే నాలుగు సార్లు, అన్నాడీఎంకే ఒక్కసారి మాత్రమే విజయకేతనం ఎగుర వేసింది. కాంగ్రెస్, సీపీఐలకు పట్టున్న ఈ నియోజకవర్గాన్ని డీఎంకే తన గుప్పెట్లోకి తీసుకుంది. ప్రకృతి వైఫరీత్యాలకు తరచూ గురయ్యే నాగపట్నం లోక్‌సభ పరిధిలో ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాలతో పాటుగా జాలర్ల ఓటు బ్యాంకు న్యాయ నిర్ణేతలు. 2009 ఎన్నికల్లోకి వెళితే..: సిట్టింగ్ ఎంపీగా ఏకేఎస్ విజయన్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి దిశలో నడిపించడంలో సఫలీకృతులు అవుతూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లో మళ్లీ ఆయన్ను సీటు వరించింది. ఆయన విజయానికి కళ్లెం వేయడం లక్ష్యంగా అన్నాడీఎంకే కూటమి తరపున సీపీఐ అభ్యర్థిగా సెల్వరాజ్ బరిలో దిగారు. ఈ ఇద్దరినీ ఢీ కొడుతూ డీఎండీకే అభ్యర్థి ముత్తుకుమార్ రేసులో నిలబడ్డారు. ఏడు లక్షల 62 వేల 988 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మూడు లక్షల 69 వేల 915 ఓట్లతో విజయన్ మళ్లీ విజయ ఢంకా మోగించారు. సీపీఐ అభ్యర్థి సెల్వరాజ్ మూడు లక్షల 21 వేల 953 ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. డీఎండీకే అభ్యర్థి ముత్తుకుమార్ 51 వేల 376 ఓట్లతో పరువు నిలబెట్టుకున్నారు. నాయకుడు : ముచ్చటగా మూడో సారి నాయకుడు అనిపించుకునేందుకు ఏకేఎస్ విజయన్ సిద్ధం అయ్యారు. సిట్టింగ్ ఎంపీకి మళ్లీ సీటును డీఎంకే కేటాయించింది. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న నియోజకవర్గాన్ని కాస్తో కూస్తో అభివృద్ధి పరచడంలో విజయన్ తన వంతు కృషి చేశారని చెప్పవచ్చు. ఢిల్లీలోని కేంద్ర మంత్రులకు పదే పదే లేఖాస్త్రాలను సంధించి మరీ తన నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని వేడుకునే వారు. అలాగే, ఎవరు పిలిచినా సరే వారి కార్యక్రమాలకు వెళ్లడం, ఒక కుటుంబ సభ్యుడిగా వారితో కలసి పోవడం విజయన్ నైజం. ఆయనకు ఉన్న వ్యక్తిగత హవా, మంచి పేరు మళ్లీ సీటు దక్కేలా చేసిందని చెప్పవచ్చు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు లక్ష్యంగా నియోజకవర్గంలో విజయన్ దూసుకెళ్తోంటే, ఆయన స్పీడ్‌కు బ్రేకులు వేయడానికి స్థానికంగా పట్టున్న డాక్టర్‌ను అన్నాడీఎంకే రంగంలోకి దించింది. డాక్టర్ కే గోపాల్‌కు అండగా మంత్రి ఆర్ కామరాజ్ నియోజకవర్గంలో తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. డీఎంకే వైఫల్యాలను టార్గెట్ చేసి ప్రచారంలో కే గోపాల్ దూసుకెళ్తోన్నారు. ఇక, సీపీఐ, సీపీఎంలకు పట్టున్న ప్రాంతాలు అనేకం. తమ బలాన్ని చాటుకునేందుకు సీపీఐ తరపున జీ పళని స్వామి రేసులో నిలబడ్డారు. కార్మికులు, జాలర్ల ఓటు బ్యాంకును టార్గెట్ చేసి ప్రచారంలో పళని స్వామి ఉరకలు తీస్తుంటే, బీజేపీ కూటమి తరపున తాము రేసులో ఉన్నామని పీఎంకే ప్రకటించింది. కూటమిలోని డీఎండీకే, బీజేపీ, ఎండీఎంకే ఇతర మిత్రుల ఓటు బ్యాంకు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి పీఎంకే అభ్యర్థికి ఏర్పడింది. తమకు పెద్దగా పట్టు లేనప్పటికీ అభ్యర్థిని కాంగ్రెస్ రేసులో దించడం విశేషం. ఆ పార్టీ అభ్యర్థిగా సెంథిల్ పాండియన్ ఒంటరిగా బరిలోకి దిగారు. ప్రకృతి వైపరీత్యాలకు తరచూ నష్టాన్ని చవి చూస్తున్న నాగపట్నంలో మార్పు తీసుకురావడంలో నాయకులు విఫలం అయ్యారన్నది జగమెరిగిన సత్యం. నాగపట్నంకు ‘నాయకుడు’ ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే! -
కొత్త ఏడాదిపై కోటి ఆశలు
కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నామంటే ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహం ఉరకలేయడం సహజం. ఎవరికి వారు వారి వారి రంగాల్లో ఏదో కొత్తదనాన్ని సాధించాలనే తపన ఉంటుంది. తపనకు అనుగుణంగా శ్రమించే వారు కొందరైతే, నెక్ట్స్‌టైమ్ బెటర్లక్ అంటూ మరో కొత్త ఏడాది వైపు ఆశగా ఎదురుచూసేవారు మరికొందరుంటారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాట రాజకీయరంగం వారికి ఈ కొత్త ఏడాది సాధారణం కాదు. ఎందుకంటే కేంద్రంలో కొత్త ప్రభుత్వానికి అంకురార్పణ బాటలువేసే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే సంవత్సరం. అన్నిపార్టీల్లోకి అధికార అన్నాడీఎంకే ఈ ఏడాది పెద్ద లక్ష్యాన్నే పెట్టుకుంది. సీఎంగా జయకేతనం ఎగురవేసిన జయలలితను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టాలని ఆ పార్టీ కంకణం కట్టుకుంది. డీఎంకే అధినేత కరుణానిధి తనదైన శైలిలో కొత్త కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యూపీఏ నుంచి దూరమైన కరుణ తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు చేసుకుని ప్రధాని పదవికి పావులు కదుపుతున్న జయకు చెక్పెట్టడంతోపాటూ కేంద్రంలో మరో దఫా చక్రం తిప్పాలని వ్యూహం పన్నుతున్నారు. రాష్ట్రంలో మూడో బలమైన, ప్రజాకర్షణ గలిగిన డీఎం డీకే అధినేత విజయకాంత్ పరిస్థితి భిన్నంగా ఉంది. అధికార అన్నాడీఎంకేతో విభేదించి ఒంటిరి పోరాటం సాగిస్తున్న కెప్టెన్‌కు మరో ఆసరా తప్పనిసరైంది. ఎడీఎంకే, డీఎంకేలు ఎవరిదోవ వారుచూసుకున్న స్థితిలో కెప్టెన్సైతం లోక్‌సభ ఎన్నికలను సద్వినియోగం చేసుకుని బలమైన శక్తిగా మారాలని ఆశిస్తున్నారు. పీఎంకే, ఎండీఎంకే, వామపక్ష పార్టీలు సైతం లోక్‌సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే స్థాయిలో విజయబావుటా ఎగుర వేయగలమనే నమ్మకంతో వారం దరూ ఉన్నారు. వీరందరి ఆశలు కొత్త ఏడాది ఏమేరకు నెరవేరుస్తుందో వేచ చూద్దాం. సినీ రంగంలో రంగుల కలలు రాజకీయ రంగానికి ఏమాత్రం తీసిపోని రీతిలో పాతుకుపోయిన తమిళ సినీ పరిశ్రమలో సైతం గత ఏడాదిలోని చేదు అనుభవాలను కొత్త ఏడాదిలో అధిగమించాలని ఆశిస్తున్నారు. సుమారు మూడేళ్లుగా కొత్త సినిమాలు చేయకుండా అభిమానులకు దూరం గా మెలగుతున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ కొత్త ఏడాదైనా దర్శనమివ్వాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. రజనీ కుమార్తె దర్శకత్వంలో రూపొం దించిన కొచ్చడయన్ చిత్రం విడుదల వాయిదా పడుతూనే ఉంది. శంకర్ దర్శకత్వంలో రజనీ మరో సినిమా చేయబోతున్నారనే అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొత్త ఏడాదిలో రజనీ సినిమాల కోసం అభిమానులేకాదు పరిశ్రమ సైతం ఎదురుచూస్తోంది. విశ్వరూపం సినిమా విడుదల సమయంలోని వివాదాలతో విసుగుచెందిన కమలహాసన్ విశ్వరూపం-2 ఈ ఏడాది విడుదల అవుతోంది. విశ్వరూపం-2ను సైతం వివాదాల్లోకి లాగితే దేశాన్ని విడిచివెళతానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని కమల్ ఇటీవల ప్రకటించారు. విశ్వరూపం విడుదల కోసం తన స్వంత ఇంటిని, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టిన కమల్‌హాసన్ ఆ సినిమా విజయంతో వాటిని విడిపించుకున్నారు. పూర్తిగా సినిమాలో మునిగిపోకుండా స్థిరాస్తులను కూడబెట్టుకుని జాగ్రత్త పడాలనే ఆలోచనలో ఉన్నారు. బెంగళూరులో ఒక భారీ థియేటర్ కొనుగోలు తృటిలో తప్పిపోయింది. ఇవన్నీ కొత్త ఏడాదిలో ఒక కార్యరూపం దాల్చాలని కమల్ ఆశిస్తున్నారు. తమ ప్రాభవాన్ని తమిళ పరిశ్రమతో సరిపెట్టుకోకుండా రజనీ, కమల్ వ లె తెలుగునాట కూడా విస్తరింపజేయాలని హీరోలు విజయ్, సూర్య, కార్తి, అజిత్, విశాల్ పోటీపడుతున్నారు. తమ సినిమాలన్నింటినీ తెలుగులోకి అనువదింపజేసి మార్కెట్‌ను పెంచుకోవాలనే ప్రయత్నాలు కొత్త ఏడాదిలో జోరందుకోనున్నాయి. హీరో విజయ్ సమకాలీనుడైన హీరో ప్రశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల వెనుకబడిపోయాడు. కొత్త సంవత్సరంలో పాత వైభవాన్ని పొందే ప్రయత్నాలను సాగిస్తున్నాడు. ఇతర నటీ నటులు కూడా కొత్త సంవత్సరంలో విజ యాలు సాధిస్తామనే ఆశతో ఉన్నారు. పెళ్లి పీటలెక్కే దిశగా.. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అనేక ప్రముఖ హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారంతా పైకి లేదంటున్నా తెరచాటుగా వారి పెద్దలు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుసలో అందరికంటే ముందు త్రిష ఉన్నారు. హన్సిక, నయనతార, అనుష్క, శ్రీయ తదితరులు పెళ్లి బాటలో ఉన్నారు. సినీరంగంలో పెళ్లికుమార్తెలుగా ప్రచారంలో లెక్కలు మించి హీరోయిన్ల పేర్లు వినపడుతుండగా పెళ్లి కుమారులుగా హీరోలు శింబు, ఆర్య పేర్లు మాత్రమే ప్రచారంలోకి రావడం విశేషం. దాదాపుగా ప్రతి హీరోయిన్ పేరు పక్కన వీరిద్దరిలో ఎవరో ఒకరి పేరు వినపడటం విచిత్రం. కొత్త ఏడాదిలో ఎవరి ప్రేమ ఎంత వరకు వస్తుందో, ఎవరితో ఎవరు పెళ్లిపీటలు ఎక్కుతారో వేచి చూడాలి.