కరుణకే పట్టం
కరుణానిధికే డీఎంకే మరోసారి పట్టం కట్టింది. డీఎంకే అధ్యక్షునిగా కరుణానిధి 11వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్బగళన్, కోశాధికారిగా స్టాలిన్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల అధికారి సద్గుణ పాండియన్ ప్రకటించారు.
⇒ డీఎంకే అధ్యక్షునిగా కరుణ 11వ సారి ఎన్నిక
⇒ కనిమొళికి మహిళా పగ్గాలు
⇒ బీజేపీని నమ్మవద్దని కరుణ ఉద్బోధ
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో డీఎంకే సంస్థాగత ఎన్నికలు నెల రోజులుగా సాగుతున్నాయి. పార్టీ పరమైన 65 జిల్లాలకుగానూ 60 జిల్లాల్లో ఎన్నికలను పూర్తి చేశారు. ఇక పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్థానాలకు కరుణానిధి, అన్బళగన్, స్టాలిన్ రెండు రోజుల క్రితం నామినేషన్లు వేశారు. ఈ నెల 9న సర్వసభ్య సమావేశం నిర్వహించి ఎన్నికైన వారి వివరాలను వెల్లడిస్తామని పార్టీ ఎన్నికల అధికారి ప్రకటించారు.
నగరంలోని డీఎంకే కార్యాలయమైన అన్నా అరివాలయంలో శుక్రవారం ఉదయం సమావేశం జరిగింది. సుమారు 2500 మంది సర్వసభ్య సమా వేశానికి హాజరయ్యారు. తొమ్మిది గంటలకు కరుణానిధి, అన్బగళన్, స్టాలిన్ వచ్చారు. ప్రధానమైన మూడు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైనందున కరుణ, అన్బళగన్, స్టాలిన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ ఎన్నికల అధికారి సద్గుణ పాండియన్ ప్రకటించారు. తర్వాత ముగ్గురు నేతలు వేదికపైకి రాగా పార్టీ నేతలు వారిని సత్కరించారు.
స్టాలిన్ సమర్థుడు: కరుణ
తొంభై ఏళ్లు పైబడిన కరుణకు పార్టీ అధ్యక్షుని హోదాలో వారసుడు ఎవరనే చర్చకు శుక్రవారం నాటి సర్వసభ్య సమావేశంలో దాదాపు తెరపడింది. ‘పార్టీని ఎలా నడిపించాలి, నేతలను ఎ లా కలుపుకుపోవాలి, సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి సమన్వయం పాటించాలి అనే అంశా ల్లో స్టాలిన్ ఎంతో సమర్థుడు అనే విషయాన్ని తాను ఏడు నెలల క్రితమే చెప్పాను. పార్టీ సంస్థాగత ఎన్నికలను నడిపిన తీరుతో స్టాలిన్ తన సమర్థతను నిరూపించుకున్నాడు’ అంటూ కరుణానిధి తన చిన్నకుమారుడుని ప్రశంసంలతో ముంచెత్తారు. తద్వారా పార్టీకి వారసుడు స్టాలిన్ మాత్రమేనని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
పరాయి వారితో జాగ్రత్త: రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కొందరు పరాయి వ్యక్తులు పావు లు కదుపుతున్నారని, వారితో జాగ్రత్తగా ఉండండని పార్టీ నేతలను కరుణానిధి హెచ్చరించారు. ఎక్కడి నుంచో వచ్చి చెన్నైలో మీటింగులు పెట్టుకుంటారు, వారి చూపంతా డీఎంకేపైనే ఉందని పరోక్షంగా బీజేపీ అధ్యక్షులు అమిత్‌షాను విమర్శించారు. డీఎంకేను కాలరాయాలని ఎందరో ప్రయత్నా లు చేసి కాలగర్భంలో కలిశారని, తమ పార్టీ ఎవ్వరికీ మింగుడు పడదని, మరెవ్వరికీ తలొగ్గదని ఆయన అన్నారు. అంతేగాక జయలలిత చేత వంచనకు గురైన వారు సైతం డీఎంకే వైపు అడుగులు వేస్తున్నారు, వారి పట్ల సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఎప్పటికీ చేజార్చుకోమన్నారు. త్వరలో పార్టీ అనుబంధ శాఖల అధ్యక్షులను నియమిస్తామని స్టాలిన్ ప్రకటించారు.
అధికార పార్టీపై ధ్వజం:పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే పాలనపై నేతలంతా ధ్వజ మెత్తారు. 2011లో జయ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అవినీతి, కుంభకోణాలు, శాంతిభద్రతల సమస్య ఎక్కువైందన్నారు. రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి (జయలలిత)కి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమాన పడడం ఇదే ప్రథమమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బినామీ ముఖ్యమంత్రి పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం తీరును నిరసిస్తూ పార్టీ త్వరలో నగరంలో ర్యాలీని నిర్వహించి గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని సమావేశంలో తీర్మానించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కరుణ తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళిని నియమించాలని నిర్ణయించారు.