కొత్త ఏడాదిపై కోటి ఆశలు
Published Wed, Jan 1 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నామంటే ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహం ఉరకలేయడం సహజం. ఎవరికి వారు వారి వారి రంగాల్లో ఏదో కొత్తదనాన్ని సాధించాలనే తపన ఉంటుంది. తపనకు అనుగుణంగా శ్రమించే వారు కొందరైతే, నెక్ట్స్‌టైమ్ బెటర్‌లక్ అంటూ మరో కొత్త ఏడాది వైపు ఆశగా ఎదురుచూసేవారు మరికొందరుంటారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాట రాజకీయరంగం వారికి ఈ కొత్త ఏడాది సాధారణం కాదు. ఎందుకంటే కేంద్రంలో కొత్త ప్రభుత్వానికి అంకురార్పణ బాటలువేసే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే సంవత్సరం. అన్నిపార్టీల్లోకి అధికార అన్నాడీఎంకే ఈ ఏడాది పెద్ద లక్ష్యాన్నే పెట్టుకుంది. సీఎంగా జయకేతనం ఎగురవేసిన జయలలితను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టాలని ఆ పార్టీ కంకణం కట్టుకుంది. డీఎంకే అధినేత కరుణానిధి తనదైన శైలిలో కొత్త కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యూపీఏ నుంచి దూరమైన కరుణ తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు చేసుకుని ప్రధాని పదవికి పావులు కదుపుతున్న జయకు చెక్‌పెట్టడంతోపాటూ కేంద్రంలో మరో దఫా చక్రం తిప్పాలని వ్యూహం పన్నుతున్నారు.
రాష్ట్రంలో మూడో బలమైన, ప్రజాకర్షణ గలిగిన డీఎం డీకే అధినేత విజయకాంత్ పరిస్థితి భిన్నంగా ఉంది. అధికార అన్నాడీఎంకేతో విభేదించి ఒంటిరి పోరాటం సాగిస్తున్న కెప్టెన్‌కు మరో ఆసరా తప్పనిసరైంది. ఎడీఎంకే, డీఎంకేలు ఎవరిదోవ వారుచూసుకున్న స్థితిలో కెప్టెన్‌సైతం లోక్‌సభ ఎన్నికలను సద్వినియోగం చేసుకుని బలమైన శక్తిగా మారాలని ఆశిస్తున్నారు. పీఎంకే, ఎండీఎంకే, వామపక్ష పార్టీలు సైతం లోక్‌సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే స్థాయిలో విజయబావుటా ఎగుర వేయగలమనే నమ్మకంతో వారం దరూ ఉన్నారు. వీరందరి ఆశలు కొత్త ఏడాది ఏమేరకు నెరవేరుస్తుందో వేచ చూద్దాం.
సినీ రంగంలో రంగుల కలలు
రాజకీయ రంగానికి ఏమాత్రం తీసిపోని రీతిలో పాతుకుపోయిన తమిళ సినీ పరిశ్రమలో సైతం గత ఏడాదిలోని చేదు అనుభవాలను కొత్త ఏడాదిలో అధిగమించాలని ఆశిస్తున్నారు. సుమారు మూడేళ్లుగా కొత్త సినిమాలు చేయకుండా అభిమానులకు దూరం గా మెలగుతున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ కొత్త ఏడాదైనా దర్శనమివ్వాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. రజనీ కుమార్తె దర్శకత్వంలో రూపొం దించిన కొచ్చడయన్ చిత్రం విడుదల వాయిదా పడుతూనే ఉంది. శంకర్ దర్శకత్వంలో రజనీ మరో సినిమా చేయబోతున్నారనే అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొత్త ఏడాదిలో రజనీ సినిమాల కోసం అభిమానులేకాదు పరిశ్రమ సైతం ఎదురుచూస్తోంది. విశ్వరూపం సినిమా విడుదల సమయంలోని వివాదాలతో విసుగుచెందిన కమలహాసన్ విశ్వరూపం-2 ఈ ఏడాది విడుదల అవుతోంది. విశ్వరూపం-2ను సైతం వివాదాల్లోకి లాగితే దేశాన్ని విడిచివెళతానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని కమల్ ఇటీవల ప్రకటించారు. విశ్వరూపం విడుదల కోసం తన స్వంత ఇంటిని, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టిన కమల్‌హాసన్ ఆ సినిమా విజయంతో వాటిని విడిపించుకున్నారు.
పూర్తిగా సినిమాలో మునిగిపోకుండా స్థిరాస్తులను కూడబెట్టుకుని జాగ్రత్త పడాలనే ఆలోచనలో ఉన్నారు. బెంగళూరులో ఒక భారీ థియేటర్ కొనుగోలు తృటిలో తప్పిపోయింది. ఇవన్నీ కొత్త ఏడాదిలో ఒక కార్యరూపం దాల్చాలని కమల్ ఆశిస్తున్నారు. తమ ప్రాభవాన్ని తమిళ పరిశ్రమతో సరిపెట్టుకోకుండా రజనీ, కమల్ వ లె తెలుగునాట కూడా విస్తరింపజేయాలని హీరోలు విజయ్, సూర్య, కార్తి, అజిత్, విశాల్ పోటీపడుతున్నారు. తమ సినిమాలన్నింటినీ తెలుగులోకి అనువదింపజేసి మార్కెట్‌ను పెంచుకోవాలనే ప్రయత్నాలు కొత్త ఏడాదిలో జోరందుకోనున్నాయి. హీరో విజయ్ సమకాలీనుడైన హీరో ప్రశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల వెనుకబడిపోయాడు. కొత్త సంవత్సరంలో పాత వైభవాన్ని పొందే ప్రయత్నాలను సాగిస్తున్నాడు. ఇతర నటీ నటులు కూడా కొత్త సంవత్సరంలో విజ యాలు సాధిస్తామనే ఆశతో ఉన్నారు.
పెళ్లి పీటలెక్కే దిశగా..
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అనేక ప్రముఖ హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారంతా పైకి లేదంటున్నా తెరచాటుగా వారి పెద్దలు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుసలో అందరికంటే ముందు త్రిష ఉన్నారు. హన్సిక, నయనతార, అనుష్క, శ్రీయ తదితరులు పెళ్లి బాటలో ఉన్నారు. సినీరంగంలో పెళ్లికుమార్తెలుగా ప్రచారంలో లెక్కలు మించి హీరోయిన్ల పేర్లు వినపడుతుండగా పెళ్లి కుమారులుగా హీరోలు శింబు, ఆర్య పేర్లు మాత్రమే ప్రచారంలోకి రావడం విశేషం. దాదాపుగా ప్రతి హీరోయిన్ పేరు పక్కన వీరిద్దరిలో ఎవరో ఒకరి పేరు వినపడటం విచిత్రం. కొత్త ఏడాదిలో ఎవరి ప్రేమ ఎంత వరకు వస్తుందో, ఎవరితో ఎవరు పెళ్లిపీటలు ఎక్కుతారో వేచి చూడాలి.
Advertisement
Advertisement