మాకేంటి సంబంధం!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలోని తమ ప్రభుత్వానికి సంబంధం ఏమిటో అని కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ప్రశ్నించారు. తమ మీద నిందల్ని వేసే విధంగా డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్లే ఆ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చిందన్న విషయం జగమెరిగిన సత్యంగా వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగిన బహిరంగ సభలో డీఎంకే అధినేత కరుణానిధి కేంద్రాన్ని టార్గెట్ చేసి పరోక్షంగా స్పందించారు.
ప్రధానంగా ఎన్నికల ఫలితాల లెక్కింపు సమయంలో పీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ కారణంగా తమ వాళ్లు అనేక చోట్ల స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని, ఇందులో పెద్ద కుట్రే జరిగిందంటూ పరోక్షంగా స్పందించడం కమలనాథుల్లో ఆగ్రహాన్ని రేపాయి. ఈ విషయంగా మంగళవారం మీడియాతో కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో, కేంద్రప్రభుత్వం, ప్రధాని కార్యాలయానికి సంబంధం ఏమిటో అంటూ కరుణానిధి వ్యాఖ్యల్ని ఖండిం చారు. కుట్రలు, కుతంత్రాలు చేయాల్సిన అవ సరం తమకు లేదని స్పష్టం చేశారు.
ఎవరికో అధికార పగ్గాల్ని అప్పగించాల్సినంతగా వ్యవహరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. డీఎంకే వర్గాల్లో పలువురు కారణం అన్నట్టుగా కూడా కరుణానిధి స్పందించినట్టున్నారే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ, ఆయన ఆరోపణలు గుప్పించి ఉండడంలో వాస్తవాలు లేవని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్ని ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యల మధ్య నిర్వహించిందని వివరించారు. డీఎంకే చేతికి అధికారం దక్కకుండా పోవడానికి కారణం, ఆ కూటమిలో కాంగ్రెస్‌ను ఆహ్వానించడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మీద తమిళనాట తీవ్ర ఆక్రోశం రగులుతున్న నేపథ్యంలో వారిని అక్కున చేర్చుకుని చేజేతులా అధికారాన్ని దూరం చేసుకుంది కాకుండా, నిందల్ని ప్రధాని కార్యాలయం మీద నెట్టేందుకు యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.