రాంచి : ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్లుగా సుస్థిరమైన, అంకితభావం గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం మరింత వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. భారత పౌరుల ఆశలను, కళలను నిజం చేసేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గురువారం మోదీ రాంచీలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...‘ పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నాం. దేశాన్ని దోచుకు తిన్న వాళ్లను శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. అభివృద్ధే మా నినాదం. మా ధ్యేయం కూడా అదే. దేశ చరిత్రలో ఇంతవేగమైన అభివృద్ధి దశను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. మా వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ లాంటిదే. అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది అని వ్యాఖ్యానించారు.
అదే విధంగా అభివృద్ధి చేయడంతో పాటు అవినీతిని అరికట్టడంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజల సొమ్మును తినాలని చూసే వాళ్లను.. వాళ్లు ఉండాల్సి చోటికే పంపిస్తామంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌లను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా వరుసగా రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కారు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్ బిల్లును చట్ట రూపంలోకి తీసుకురావడంతో పాటు జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇక నరేంద్ర మోదీ సర్కారు దేశాన్ని ఆర్థిక తిరోగమనంలోకి తీసుకువెళ్తోందంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment