లేహ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రజలు
లేహ్/జమ్మూ/శ్రీనగర్: రైతులకు ఆరు వేల రూపాయలు ఎంత ముఖ్యమనే విషయం ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చునే వారికి తెలియదంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ్టపై ఆదివారం విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులను ఆకట్టుకునే ఉద్దేశంతో ఐదెకరాల్లోపు సాగు భూమి ఉన్న వ్యవసాయదారులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్రం తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రైతులకు ఇచ్చేది రోజుకు 17 రూపాయలేనా, ఇది వారిని అవమానించడమేనంటూ ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలకు స్పందనగా జమ్మూ కశ్మీర్‌లో మాట్లాడుతూ ‘పీఎం–కిసాన్ ఒక గొప్ప పథకం.
పేద రైతుకు ఈ రూ.6 వేలు ఎంత ముఖ్యమో ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చునే వారికి అర్థం కాదు. ఈ రాష్ట్రంలో కూడా చాలా మందికి ఈ పథకం వల్ల లబ్ధి జరుగుతుంది. ఆదివారమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మార్గదర్శకాలు పంపిస్తా’ అని అన్నారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని విజయపూర్‌లో మోదీ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీని కాంగ్రెస్ ఎన్నికల గిమ్మిక్కుగా వాడుతోందని మోదీ ఆరోపించారు. ‘2008–09లో రూ. 6 లక్షల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించి, అధికారంలోకి వచ్చాక, రూ. 52 వేల కోట్ల విలువైన రుణాలనే మాఫీ చేసింది. మాఫీ పొందిన వారిలో 30 లక్షల మంది అనర్హులే ఉన్నట్లు కాగ్ తేల్చింది’ అని మోదీ అన్నారు.
భరతమాత బిడ్డలకు సాయం చేస్తాం..
1947లో దేశ విభజన కారణంగా ఈ దేశ పౌరులు కాకుండా పోయిన భారతి బిడ్డలను కాపాడతామని చెప్పారు. కశ్మీరీ పండితుల మహా నిష్క్రమణం తననెప్పుడూ గుండెల్లో బాధకు గురిచేస్తుంటుందని మోదీ వెల్లడించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ .. శ్రీనగర్, లడఖ్, లేహ్, విజయ్‌పూర్, కఠువా తదితర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు.
లేహ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment