తహసీల్దార్‌ హత్యపై రాజకీయ దుమారం | Political Leaders Disputes Regarding Tahsildar Murder In Ranga Reddy | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ హత్యపై రాజకీయ దుమారం

Published Thu, Nov 7 2019 12:17 PM | Last Updated on Thu, Nov 7 2019 12:18 PM

Political Leaders Disputes Regarding Tahsildar Murder In Ranga Reddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనంపై జిల్లాలో రాజకీయ రగడ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడిన రాజకీయం.. విజయారెడ్డి హత్యోదంతంతో క్రమంగా వేడెక్కుతోంది. తహసీల్దార్‌ హత్యకు నువ్వంటే.. నువ్వే కారణమని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఒకరిపై ఒకరు మీడియా వేదికగా ఆరోపించుకుంటున్నారు.

ఆది నుంచి వీరు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి పడని వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుతూ సవాల్‌.. ప్రతి సవాల్‌ విసురుకుంటున్నారు. సోమవారం రైతు కూర సురేష్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై కార్యాలయంలోనే పెట్రోల్‌ పోసి నిప్పటించడంతో సజీవదహనమైన చేసిన విషయం తెలిసిందే. ఈ అమానుషానికి ప్రధాన కారణమైన భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే హస్తం ఉందని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణల బాంబ్‌ పేల్చడంతో వివాదం రాజుకుంది. భూముల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసిన ఆయన... ల్యాండ్‌ మాఫియాకు ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నారని తీవ్రపదజాలంతో విరుచుకుపడటం సర్వత్రా చర్చనీయాంశమయింది.

రూ.వేల కోట్లు ఎలా వచ్చాయ్‌?
భూ మాఫియా అంటేనే మల్‌రెడ్డి రంగారెడ్డి. గత 20 ఏళ్లుగా ఆయనకు ఆస్తులు, భూములు ఎలా వచ్చాయో విచారణ జరిపితే తెలుస్తుంది. వందశాతం భూకబ్జా దారుడు.. ల్యాండ్‌ గ్రాబర్‌.. విచారణ జరిపిస్తే మాఫియా ఎవరో బయటపడుతుంది. తహసీల్దార్‌ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో తేలాలి. విజయారెడ్డి హత్య కేసులో కావాలనే నాపై బురదజల్లుతున్నారు. నేను సాయం చేసే మనిషినే..అన్యాయం చేసే వాడినికాదు. రెండెకరాల మనిషి.. రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. మా ఆస్తులన్నీ మా తాతలు, తండ్రుల కాలం నాటివే. అబ్దుల్లాపూర్‌మెట్‌ చుట్టుపక్కల ఉన్న 412 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ జరిపి తీరాలి.

వాస్తవాలేంటో తేలుతాయి. అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ దగ్గర సర్వే నంబర్లు 230 – 233లో ఉన్న 16 ఎకరాల భూమిని మల్‌రెడ్డి రంగారెడ్డి బంధువులే కబ్జా చేశారు. మెట్రోసిటీ పేరుతో 60 ఎకరాలను కొల్లగొట్టారు. నేను రూ.30 లక్షలు ఎవరి దగ్గరా వసూలు చేయలేదు. తీసుకున్నట్లు ఆయన రుజువు చేయాలి. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తే స్పందించాలా అనుకున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.  
– మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యే

40 ఎకరాలు ఎవరబ్బ సొమ్ము?
ల్యాండ్‌ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి. నయీంతో దోస్తీ చేసిన వ్యక్తి ఆయన. నాకున్న ఆస్తుల వివరాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఆ వివాదాస్పద భూముల్లో నా బంధువులు అక్రమంగా కొనుగోలు చేస్తే 24 గంటల్లోగా స్వాధీనం చేసుకుని పేదలకు పంచండి. అధికారంలో మీరే ఉన్నారు. సీఎంకు కూడా చెప్పు. నేను పది మందికి మంచి చెప్పేవాడిని. నేను ఎవరితోనూ చెప్పించుకోను.

నువ్వు చెబుతున్నట్లుగానే.. ఎప్పుడో మావాళ్లు భూములు కొని ఉంటే ఇన్ని రోజులు ఏం చేశావ్‌? పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అడగలేదు? రూ.400 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఇబ్రహీంపట్నంలో కాజేశావ్‌. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఓఆర్‌సీ ఇప్పించావ్‌. దాని పక్కనే ప్రభుత్వ సంస్థలకు భూమిని గతంలో ఇచ్చారు. పోలీస్‌స్టేషన్‌, మార్కెట్‌ కమిటీ, ఆర్టీసీ డిపోలకు దాదాపు 30 ఎకరాలు కేటాయించారు. ఇదిపోగా 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్మని బినామీల పేరిట తెచ్చుకున్నావ్‌? 
– మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement