
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ–బీఎస్పీ) కూటమి అత్యంత ప్రభావశీలిగా మారనుంది. సుమారు 24 ఏళ్ల క్రితం బీఎస్పీ అధ్యక్షుడిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన తరువాత ఉప్పు నిప్పుగా ఉన్న ఈ రెండు పార్టీలు ఈసారి ఒకే వేదికపైకి వచ్చి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌కు ప్రచారం చేసేందుకు సిద్ధం కావడం ఇరు పార్టీల మధ్య సమన్వయానికి నిదర్శనం. గత ఇరవై ఏళ్లలో మాయావతి ఏనాడూ ములాయం గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడకపోవడాన్నిఇక్కడ గుర్తు చేయాలి.
ఎవరికివారే..
ఎన్నికలకు ఇంకో రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలూ ప్రచారం జోరు పెంచే పనిలో ఉన్నాయి. చర్చలు ఎప్పుడో అటకెక్కాయి. కులం, వ్యక్తిగత భేషజాలు, ప్రాంతాల ప్రభావాలకే పెద్దపీట వేసిన పార్టీలు.. విపక్షాల ఐక్యతను పక్కనపెట్టి ఎవరికివారే చందంగా మారిపోయాయి. సోనియా, రాహుల్‌గాంధీపై గౌరవంతో తాము రాయ్‌బరేలీ, అమేథీలో ఎవరినీ పోటికి పెట్టడం లేదని ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రకటిస్తే.. యూపీ మొత్తమ్మీద ములాయం కుటుంబసభ్యులు పోటీ చేసే ఏడు స్థానాల్లో తామూ ప్రత్యర్థులను పెట్టబోమని కాంగ్రెస్ కుండబద్దలు కొట్టింది. విపక్షాల అనైక్యతకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఈ పరిణామాలన్నీ బీజేపీ ఆశించినవే. చూడాల్సిందల్లా.. విపక్షాల అనైక్యత కాషాయదళానికి ఎంతమేరకు లాభిస్తుందన్నది మాత్రమే!
కులం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఢీకొట్టగలవని ఇటీవలి ఉప ఎన్నికలు ఇప్పటికే రుజువు చేశాయి. గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్, కైరానా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి తరఫున నిలబడిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఈ మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తాజా ఎన్నికలకు సంబంధించి ఎస్పీ–బీఎస్పీ కూటమిలో అజిత్ సింగ్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్ కూడా ఉండటం బీజేపీని ఢీకొట్టేందుకు మరింత శక్తినివ్వనుంది.
పుంజుకుంటున్న కాంగ్రెస్..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఎస్పీ –బీఎస్పీల కూటమి.. బీజేపీ మధ్య మాత్రమే కాదు. గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ కూడా తన శక్తిని కూడగట్టుకుంటూ పోటీదారుగా నిలవనుంది. పార్టీని బలోపేతం చేసుకునేందుకు రెండేళ్ల క్రితం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు ఇందులో భాగమైనప్పటికీ ఫలితాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా ప్రియాంక గాంధీని తూర్పు ఉత్తరప్రదేశ్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించింది. పేరుకు తూర్పు యూపీ ఇన్‌చార్జ్ కానీ.. ప్రియాంక యూపీ కాంగ్రెస్ కమిటీని నామమాత్రం చేసేశారు. దాదాపు అన్ని అంశాల్లోనూ ఆమె మాటే చెల్లుబాటవుతోంది. వారణాసి, ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), మిర్జాపూర్, అయోధ్యతో కూడిన తూర్పు యూపీ నుంచే కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టడమే కాకుండా.. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక చిన్న పార్టీలతో జట్టు కడుతోంది. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రం మొత్తమ్మీద చాలా స్థానాల్లో కాంగ్రెస్ మిగిలిన పక్షాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఈ రకమైన ముక్కోణపు పోటీ ఏర్పడగల స్థానాల్లో ముఖ్యమైనవి ఖుషినగర్, సహారన్‌పూర్, ఫరూఖాబాద్, ఫతేపూర్ సిక్రి, బారాబంకి, ఘజియాబాద్ ఉన్నాయి. వ్యతిరేక ఓటు కాస్తా కాంగ్రెస్, ఎస్పీ–బీఎస్పీ కూటమికి మళ్లిపోవడం వల్ల కొన్నిచోట్ల బీజేపీ కూడా లాభపడే అవకాశముంది.
శివపాల్ ప్రభావం ఎంత?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రసవత్తరమైన ఇంకో కోణం ఏమిటంటే.. ములాయంసింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్ సొంతంగా పార్టీ పెట్టుకోవడం. చిన్న చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా శివపాల్ తక్కువ సమయంలోనే శక్తిగా ఎదిగారు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)తోపాటు పీస్ పార్టీ, అప్నాదళ్‌తో ఈయన జట్టుకట్టారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. శివపాల్ యాదవ్ బలంగా ఉన్నచోట్ల పోటీ చతుర్ముఖం అవుతుంది. ఇది కాస్తా బీజేపీకే లాభిస్తుంది. మొత్తమ్మీద చూస్తే.. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునేందుకు ఎస్పీ –బీఎస్పీ పొత్తు పెట్టుకున్నప్పటికీ కొన్ని స్థానాల్లో ఈ ప్రయోజనం దక్కని పరిస్థితి ఏర్పడిందన్నమాట. సరిగ్గా ఇదే లక్ష్యంతో బీజేపీ తెరవెనుక నుంచి శివపాల్‌కు మద్దతిస్తోందని ఎస్పీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో శివపాల్ చివరకు కాంగ్రెస్‌తో జట్టుకట్టవచ్చునని కూడా వార్తలున్నాయి. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కొంతకాలంగా చెబుతున్నది కూడా ఇదే. కాంగ్రెస్ విపక్షాల ఐక్యతకు కాకుండా తను సొంతంగా బలపడేందుకే ఇష్టపడుతోందని మాయావతి ఆరోపిస్తున్నారు.
డేట్‌లైన్ లక్నో రతన్ మణిలాల్
(ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కేంద్రంగా పనిచేస్తున్న రచయిత టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ మాజీ సంపాదకులు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వేర్వేరు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. జైపూరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, స్కూల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ అధిపతిగానూ వ్యవహరించారు)