
భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే భారీ ఎన్నికలుగా భావిస్తోన్న 2019 లోక్‌సభ ఎన్నికలకూ గతంలో జరిగిన ఎన్నికలకూ పోలికేలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో హామీలు గుప్పిస్తేనో, జనాన్ని మభ్యపెట్టాలని చూస్తేనో ఓట్లు రాలే పరిస్థితి ఇప్పుడు లేదు. అభ్యర్థుల ప్రచారమొక్కటే గట్టెక్కించే పరిస్థితీ లేదు. అందుకే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉంటే, తెరవెనుక కొందరు, తమ క్లయింట్లను గెలిపించేందుకు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దశాబ్దాల ఎన్నికల గణాంకాలను తవ్వి తీసి, వాటి ఆధారంగా గెలుపోటములను అంచనావేసి, వ్యూహాలు రచిస్తున్నా రు. రాజకీ య సలహాదారులు, వ్యూహకర్తలు, విశ్లేషకు లు, డిజిటల్ మార్కెటీర్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో కూడిన యువసైన్యం రోజుకి 12 నుంచి 14 గంటలు శ్రమిస్తున్నారు.
ప్రధాన పాత్ర వ్యూహకర్తలదే
గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవి. ఓటరు మహాశయుడిని ఆకట్టుకోవాలంటే గతంలో మాదిరిగా రాజకీయవేత్తలు కేవలం ప్రచారంపై ఆధారపడితే సరిపోదు. ప్రస్తుత ఎన్నికల సరళిలో సమూలమైన మార్పులొచ్చాయి. ఒక సీటుని తమ ఖాతాలో వేసుకోవాలంటే అంతకు మించిన విషయాలెన్నో కీలకప్రాత పోషిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును ఖాయం చేసేందుకు పనిచేసే నిపుణులనే క్యాంపెయిన్ మేనేజర్స్, పొలిటికల్ కన్సల్టెంట్స్, ఎలక్షన్ మేనేజర్స్,స్ట్రాటజిస్టులని వివిధ పేర్లతో పిలుస్తున్నారు.
ప్రశాంత్ కిశోర్ సహా..300 మంది నిపుణులు
ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా ప్రముఖ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన కాకుండా ఎందరో సరికొత్త రాజకీయ వ్యూహకర్తలు తమ క్లయింట్లకు ఘనవిజయం సాధించి పెట్టడంలో ఉద్దండులుగా ముందుకొస్తున్నారు. ట్రేడ్ అసోసియేన్ ‘అస్సోచామ్’ ప్రకారం 2014లో దేశంలో దాదాపు 150 మంది రాజకీయ నిపుణులుండగా ప్రస్తుతం వారి సంఖ్య రెట్టింపై.. 300 మందికి చేరుకుంది. వీరంతా గెలుపు గుర్రాలకు ఓట్ల వర్షం కురిపించే వ్యూహరచనలో మునిగి తేలుతున్నారు. రోజు రోజుకీ వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం గమనించాల్సిన విషయం. జనంతో ఓట్ల వర్షం కురిపించేందుకూ, సృజనాత్మకమైన ఎత్తుగడలతో వ్యూహరచన చేసి, తమ అభ్యర్థులకు విజయాన్ని సాధించి పెడతామనే హామీనిచ్చి, ఆ హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నారు.
విజయానికి విభిన్న వ్యూహాలు
అసెంబ్లీ ఎన్నికల కు, పార్లమెంటు ఎన్నికలకు రెండు విభిన్న ఎత్తుగడలను, వ్యూహాలనూ స్ట్రాటజిస్టులు అమలు చేస్తున్నారు. రాజకీయ ఉద్దండులైన సచిన్ పైలట్, కెప్టెన్ అమరీందర్ సింగ్, టీఎస్.సింఘ్ డియో, కిరన్ చౌధరిలను విజయతీరాలకు చేర్చిన రాజకీయ వ్యూహకర్త, క్యాంపెయిన్ డైరెక్టర్, ‘డిజైన్ బాక్స్‌డ్’ కి చెందిన నరేష్ అరోరా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికాంశాలు, లోక్‌సభ ఎన్నికల్లో జాతీయాంశాలు ప్రాధాన్యం వహిస్తాయని చెప్పారు. నరేష్ అరోరా ప్రస్తుతం మహారాష్ట్రలో ఓ కొత్త ప్రాజెక్ట్‌లో 2019 ఎన్నికల కోసం పనిచేస్తున్నారు.
ఇంటింటి ప్రచారమే కీలకం..
దేశవ్యాప్తంగా వెయ్యి ప్రచార కార్యక్రమాలకు నేతృత్వం వహించిన ఎలక్షన్ కన్సల్టెన్సీ డైరెక్టర్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ‘లీడ్ టెక్’కు చెందిన వివేక్ బగ్రీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం కీలకం అంటున్నారు. ప్రచారకర్తలు నేరుగా ఓటర్ల ఇంటి తలుపు తట్టాల్సి వస్తుందనీ, ఇందులో వలంటీర్లు, పార్టీ కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషిస్తారనీ అంటారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పరోక్షంగా ఓటర్లను ప్రభావితం చేసే సమాచారం ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.
ఫేక్ న్యూస్‌తో తలబొప్పి..
ఫేక్ న్యూస్‌ని ఎదుర్కోవడమే అసలైన సవాల్ అని అరోరా అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో రోజు రోజుకీ ఫేక్ న్యూస్ బెడద పెరుగుతోంది. ఏది ఫేక్, ఏది నిజమైన వార్తో తెలుసుకోవడం కూడా ఛాలెంజ్‌గా మారింది. గెలిచే వారితో ఇబ్బంది ఉండదు. కానీ వెనుకబడి ఉన్న అభ్యర్థి విషయంలో చాలా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందనేది బాగ్రీ అభిప్రాయం.
ఓట్ల పెంపు ఇలా
ఎన్నికల అంశాలను శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషించి, సరికొత్త వ్యూహా లతో ఓటింగ్ శాతాన్ని అదనంగా 2 నుంచి 5 శాతం వరకు పెంచవచ్చునని కొందరు ప్రచార వ్యూహకర్తలు చెపుతున్నారు. సరైన వ్యూహాన్ని రచించి, కొత్త ప్రచార విధానాలతో ముందుకు వెళ్లటం ద్వారా ఓటర్లలో మార్పు సాధ్యమంటున్నారు. సరైన సమయంలో సరైన వ్యూహరచన ద్వారా ఎన్నికల్లో ఐదు శాతం వరకు పోలింగ్ శాతాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవచ్చునని క్యాంపెయిన్ మేనేజర్లూ, ఎన్నికల వ్యూహకర్తలూ అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రీపోల్ సర్వేల ద్వారా ఎన్నికల వ్యూహాలను రచించగలిగితే, కొద్ది తేడాతో గెలుస్తారనుకున్న అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిసేలాగా చేయొచ్చని బగ్రీ అన్నారు.
ఆ అంశాలే వ్యూహంలో కీలకం
దేశంలోని జాతీయ నాయకులు, మీడియా ఎంపిక చేసిన ప్రధానమైన అంశాల చుట్టూనే ‘2019 దంగల్’కు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని అంటున్నారు వివేక్ బగ్రీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిరోజూ, ప్రతి నిమిషం విలువైనదేనంటోన్న నిపుణులు ప్రస్తుతం తెరవెనుక వ్యూహరచనలో తలమునకలై ఉన్నారు. ‘మెయిన్ కెప్టెన్ దే నాల్’ పేరుతో పంజాబ్‌లోనూ, ఛత్తీస్‌గఢ్‌లో ‘జన్ ఘోషణా ప్ర™’, ‘రాజస్తాన్ కా రిపోర్ట్ కార్డ్’ లాంటి అరోరా క్యాంపెయిన్‌లో ప్రధాన శీర్షికలుగా రేయింబవళ్లు కష్టపడుతున్నామని చెప్పారు. ఒకరోజు ముందే నిర్ణయించుకున్న వ్యూహాలను రోజూ ఉదయాన్నే సమీక్షించే వాళ్లమని ఆ రోజు గడిచే కొద్దీ క్షేత్రస్థాయి నుంచి ప్రచార దళాలు అందించే సరికొత్త అంశాల సమాచారం ఆధారంగా రోజంతా బిజీగా ఉంటామని అరోరా చెప్పారు. ఆ రోజులో చివరిగా, ఆ రోజు జరిగిన ప్రచార సరళిని సమీక్షించి, క్షేత్రస్థాయి ప్రచార దళాలు అందించే సమాచారం ఆధారంగా మరుసటి రోజు వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment