
సాక్షి,కర్నూలు: శాసనసభ, లోకసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంతోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. అన్ని పార్టీలు కోడ్‌ను పాటించాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతోనే కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ ప్రకటించారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రతి మండలానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీఎంసీ) టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కోడ్ సమయంలో రాజకీయ పార్టీల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికార పార్టీ ఎలా వ్యవహరించాలి.. తదితర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై ‘సాక్షి’ కథనం.
రాజకీయ నేతల ప్రవర్తన:
పార్టీలు, నేతలు అభ్యర్థులు జాతి, కుల, మత ప్రాంతీయ పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటపుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పని తీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధం లేని, వ్యక్తిగత దూషణలు చేయకూడదు.
- రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థ్థనలు చేయకూడదు. మసీదులు, చర్చీలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు.
- ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించుకోవడం, పోలింగ్ స్టేషనుకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం వంటివి చేయరాదు.
- ప్రశాంత గృహ జీవితాన్ని గడిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దానికి భంగం కలిగేలా ప్రవర్తించకూడదు. ప్రజల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేయడం, పికెటింగ్‌లు చేయడం వంటివి నిబంధనలకు విరుద్ధం.
- అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం.
ఊరేగింపులు:
- పార్టీలు, ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఊరేగింపు ఎపుడు , ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ మార్గం గుండా వెళుతుంది? ఎక్కడ ఎన్ని గంటలకు ముగుస్తుంది? తదితర వివరాలన్నీ ముందే సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించాలి. దాన్నిబట్టి వారు అవసరమైన ఏర్పాటు చేసుకుంటారు.
- ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు పొడవుగా ఉంటే, దాన్ని మధ్యలో విడగొట్టి కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి.
- సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీ నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు. నిలదీయ కూడదు. కరపత్రాలు పంచరాదు.
- ఒక పార్టీ చేసిన పోస్టర్లను వేరే పార్టీ వారు తొలగించకూడదు. రెండు అంతకంటే ఎక్కువ పార్టీలు ఒకే దారిలో ఒకే సమయంలో ఊరేగింపు నిర్వహించాలనుకుంటే, ముందుగానే పోలీసులను సంప్రదించాలి. ఊరేగింపులు ఎదురెదురుగా రాకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు.
- ఊరేగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో చూపించాలి.
ప్రచార వ్యయం.. పరిమితం
ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం లోకసభకు పోటీచేసే అభ్యర్థులు రూ.70లక్షలు, అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులు రూ.28 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటి నుంచి నామినేషన్ వరకు ఎన్నికల ఖర్చు పార్టీపైన, నామినేషన్ తర్వాత అభ్యర్థిపైన ఎన్నికల ప్రచార ఖర్చు నమోదు చేస్తారు. ప్రభుత్వ అధికారులు తమ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను పెట్టుకోరాదు.
సభలు, సమావేశాలు
పార్టీలు, సభలు నిర్వహించాలనుకున్నపుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. ఈ మేరకు పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలనుకనే చోట ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగా తెలుసుకోవాలి. నిషేధాజ్ఞలు అమలయ్యే ప్రదేశాల్లోకి ప్రవేశించినపుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.
- లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే
అనుమతి తీసుకోవాలి.
- సభలకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే నిర్వాహకులు వారిపై నేరుగా దాడులకు పాల్పడకూడదు. పోలీసులకు సమాచారం అందించాలి.
అధికార పార్టీ ః
- అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాంగాన్ని వినియోగించుకోకూడదు. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండు కలిసి ఉండకూడదు.
- ముఖ్యమంత్రి అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా శాంతి భద్రతకు భంగం కలిగినపుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు హెలికాప్టరును వాడవచ్చును. మంత్రులు ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.
- ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు, తదితర సౌకర్యాలను కేవలం అధికార పార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
- టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి అనుమతి పొందాలి. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు చెల్లింపులు చేయకూడదు.
- కొత్త పథకాలు ప్రకటించకూడదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదు. రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.
Comments
Please login to add a commentAdd a comment