పదారు గెల్శి పదానవుడే! | Political Satirical Story on Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

పదారు గెల్శి పదానవుడే! పీవి లెక్క ఐదేండ్లుండుడె!!

Published Sat, Apr 6 2019 8:46 AM | Last Updated on Sat, Apr 6 2019 8:46 AM

Political Satirical Story on Lok Sabha Elections - Sakshi

మొన్ననె లోకల్‌ ఎలశ్చన్ల గెల్శిన రమేషు పిలిత్తె పంచాతాఫిస్కు పోయ్న. అప్పట్కె కాయిదంల లెక్కలేసుకుంటన్న రమేషు... మోడికి హీరాబిమాని ఎర్ర నాగ్రాజు తోటి లొల్లి వెట్టుకుంటండు. రమ్నరావు, లచ్చన్న ఇచ్చంత్రంగ సూస్తండ్రు.

మమ్ముల సూడంగనె ‘ అరె గీ నాగ్రాజు  శెప్పింది యినకుండ గంట కెల్లి దిమాక్‌ తింటండుర. వీని మోడి బజ్న యెక్కువైంది ’ అన్నడు. నేనాన్ని జూసి నవ్వుకుంట... ఎందుకురా... ఎర్రటెండల రమేష్ను పరెశాన్‌ జేత్తన్నవ్‌ . ఆల్ల యెమ్మెల్లె అత్తన్నడంట పచారానికి పోవాలె... అన్న.

ఏం జెప్పాల్ర బై. మాట్లాడితె పదారు అంటండు. నీకు తెల్వది గద. మాసారు... కారు.. పదారు... సర్కారు అన్కుంట పాటవాడ్తండు... పదారు గెల్శి కేసియారు పదాని అయితడని లొల్లి వెడ్తండు. ఎట్లయితడ్రా  అంటె ఇరువై ముప్‌పై ఏండ్ల కిందటి లెక్కలు సూపించి సంపుతున్నడు... తల వట్టుకొని చెప్పిండు నాగ్రాజు

పదారు గెల్శి బరాబర్‌ సారు పదాని అయితడ్రా... ఇరువై మూడేండ్ల కిందట కర్నాటక ముక్కెమంత్రి దేవగవుడ పదానైనట్టె ... గీసారి మా సారు అయితడు. యెప్పుడు జూసిన నిద్రల్నె ఉండే దేవగవుడ ...  తెల్వి లేక యాడాదికె దిగిపేండు. గని మా కేసియార్‌ గా రికార్డుల్ని బోర్లేపిచ్చి కొత్తయి రాపిత్తడు... తగ్గకుంట శెప్పిండు రమేషు.

అవురా నాకు తెల్వక అడుగ్తా... దేశంల 545 పాల్రమెంటు శీట్లున్నయ్‌.  గండ్ల సగం కంటె ఎక్వంటె...  273 శీట్లు యే పార్టికన్న అత్తెనో...  నాలై్గదు పార్టిల కూటంకు అత్తెనో అండ్లకెలి ఒగలు పదానైతడు. మరి గీడ వున్నయే పదిగేడు శీట్లాయె. గండ్ల వోటి మజిలిస్‌కె పాయె. మిలిగిన పదారు సీట్లను మీ గులాబి పార్టె గెల్శిన, మీసారు పదానెట్లయితరు ... అందరి ముందె మల్లడ్గుతున్న చెప్పున్రిు..  నాగ్రాజు గాడు బొమ్మలెగిరేసిండు.

రమేషుకు సుర్రున కోపమచ్చింది. అరె నాగ ... పరాశికాలు ఆడకురా.  1996ల బార్తీయ జంత పార్టి కూటంకి 161 శీట్లత్తె్త కాంగిరెస్‌కు 79 అచ్చినయ్‌. గప్పట్ల నేశ్నల్‌ పార్టి జంతదల్‌ మొత్తమ్మీద  46 గెలుత్తె... వొక్క కర్నాటకల్నె పదారు అచ్చినయ్‌.. గప్పుడు దేవగవుడ కర్నాట్కకు ముక్కెమంత్రి.  పదారు దెచ్చింది గాయినె గన్క దేవగవుడ పదానయిండు. ఇరువై మూడెండ్ల కిందటి సంగతులను పొల్లువోకుంట శెప్పిండు.

1996ల పాల్రమెంట్‌ ఎలశ్చన్లయినంక వాజ్పాయి సాబ్‌ 13 రోజులు గవుర్నమెంట్‌ నడిపిండు. యేరే పార్టిలు సపోట్‌ జెయ్యక... ఫుల్లు మెజార్టి నిరూపన గాక రాజినామిచ్చిండు ... గప్పుడు దేశెంలున్న 13 లోకల్‌ రాశ్ట పార్టిలు గల్శి యునైటెడు ఫ్రంటు వెట్టి దేవగవుడను పదానిని జేసినయ్‌...  ఆనాటి లెక్కలు జెప్పిండు రమ్నరావు .

గీ నిద్రమొకపు దేవగవుడ 10 నెల్లకె దిగిపోతె గదె జంతదల్‌ పార్టి కెల్లి అయికె గుజరాల్‌ పదానైండు. గాయినో 11 నెల్లు దేశాన్నేలి రాజినామ వెట్టిండు. 1998ల మల్ల ఎలశ్చన్లత్తె వాజ్పాయి సాబ్‌ సుత తమిల్నాడు జయలలిత మదత్‌ యెన్కకు దీస్కుంటె 13 నెల్లకె దిగిపోయిండె గద... గప్పుడె ఆడికచ్చిన లచ్చన్న గుర్తు జేసిండు.  

గదే ... గీ కలెగూర గంప పార్టిలు దేశాన్ని యేలాల్నని 1978 కెల్లి యెన్ని కోశీష్‌లు జేసినా కాలె.  1978ల జంతా గవుర్నమెంట్‌ పొత్తులు బెడ్సి ఇచ్చుకపాయె. మురార్జిదేశెయ్, చరన్‌సింగులు పదాని çపదివిలల్ల ఉండుడు మూడ్రోజుల ముచ్చటే అయె. 1989ల జంతాదల్, లోకల్‌ పార్టిల అల్యన్స్‌ గట్టనె ఆయె. వీపిసింగు, శెంద్రశేఖరు గల్సి రొండేండ్లన్న గవుర్నమెంటు నడుపలె. 1996 కాడ్నుంచి 1998 దాక మళ్లో ఇద్దరు దేవగవుడ, అయికె గుజరాలు సుత నడువంత్రపు పదానులుగనె ఉండిరి.... నేను సుత తెల్సినయి జెప్పిన.

  దేశాన్నేలుడంటె మాటలా?గాళ్లకు తెల్విలేదు. గీ మూడ్రోజుల పీయెం గిరి ఎల్గవెట్టినోళ్లల్ల దేవగవుడ దప్ప అందరు నార్తోళ్లే . 1991ల 244 సీట్లు గెల్శిన కాంగిరెస్‌ మైనార్టి సర్కార్‌ను మన తెలంగాన పెద్దాయిన పీవి నర్సిమ్మరావ్‌ ఐదేండ్లేలలేద? తెలంగాన దెచ్చిన మా కేసియార్‌ సుత గసొంటి తెల్వున్నోడె గద. గీడ గెల్చె పదారు సీట్లకు...  ఉత్తర, దశ్చిన రాశ్టాలల్ల లోకల్‌ పార్టీలు గెల్శె శీట్లను గల్పుకొని ఫెడ్రల్‌ ఫ్రంటు వెడ్తడు.  అన్ని పార్టిలు మద్దత్‌ జేస్తయ్‌. కెసియారే పదానైతడు... ఐదేండ్లేల్తడు.. రమేషు తన శీట్ల నుంచి లేసుకుంట బల్లగుద్ది జెప్పిండు.-పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement