
సాక్షి,సిటీబ్యూరో: కేంద్రంలో కేసీఆర్ సారథ్యంలోని ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం తథ్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి మహోన్నత సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలించిందని గుర్తుచేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి అఖండ విజయమే లక్ష్యంగా శుక్రవారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు, నీళ్లు, నిధులు, నియామకాలను చేపట్టి అన్నివర్గాల ప్రజలను సంతృప్తి పరిచిన గొప్పనేత కేసీఆర్ అని కొనియాడారు. పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో అద్భుత విజన్ ఉన్న సీఎం కేసీఆర్ అని, విద్యుత్, నీటి కష్టాలను దూరం చేసిన గొప్ప సీఎం అని పేర్కొన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని, నాడు రెండు సీట్లతో తెలంగాణ సాధించిన కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ గెలిచిన 16 ఎంపీ సీట్లను 216కు పెంచి కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ నవభారత నిర్మాణం చేస్తానని ప్రగల్భాలు పలికి అన్ని అంశాల్లోనూ విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశంలో అన్ని వర్గాలను మోదీ సర్కారు కుదేలు చేసిందని, వారికి పాలన చేతకాదని విమర్శించారు. సభలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు పుస్తె శ్రీకాంత్, తలసాని సాయికిరణ్ యాదవ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఆశీస్సులతో బరిలో నిలిచిన తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఙప్తి చేశారు. కేంద్రంలో ‘సారు..కారు..పదహారు.. సర్కారు’ అన్నదే తమ ఎన్నికల ప్రచార నినాదమని నినదించారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యేలు గోపీనాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, మైనంపల్లి హన్మంతరావు, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల పరిధి నుంచి భారీగా జన సమీకరణ చేసినప్పక్కీ సీఎం కేసీఆర్ సభకు హాజరు కాకపోవడంతో కార్యకర్తలు నిరాశ చెందారు. కళాకారుడు సాయిచంద్ బృందంతో ఆటాపాటలతో ఉర్రూతలూగించారు.
Comments
Please login to add a commentAdd a comment