సాక్షి, ఖమ్మం టౌన్: రాష్ట్రంలో ఓటు రాజకీయాలు తప్ప.. అభివృద్ధి కార్యక్రమాలు లేవని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరోగ్య తెలంగాణను అనారోగ్య తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా బీజేపీపై టీఆర్‌ఎస్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రజలను మభ్య పెడుతూ ఆర్థిక సంక్షోభం అంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుబారా ఖర్చులు పెడుతూ.. రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని కాంట్రాక్టర్ల రాష్ట్రంగా మార్చేశారని.. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని.. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా ఖమ్మం మారిందని పొంగులేటి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment