ఎప్పుడూ కేసీఆర్ కాలమే నడవదు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ‘నాలుగు ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన ఎప్పుడూ కేసీఆర్ కాలమే నడుస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఎండాకాలం తర్వాత వర్షాకాలం, ఆపై శీతాకాలం లాగా.. కాలభ్రమణం తప్పదని తెలుసుకుంటే మంచిది’ అని అధికార పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హితవు పలికారు. ఆదివారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్షం తరపున పొంగులేటి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మధ్యలో ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్సీలు జోక్యం చేసుకోవడంపై ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, తాగునీటి కష్టాలు వంటి కీలకమైన సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.3,500 కోట్లు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తనవాటా (10శాతం) కింద రూ.350 కోట్లు విడుదల చేయలేదని పొంగులేటి విమర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో కుంభకోణాలకు పాల్పడి బ్లాక్ లిస్ట్‌లో చేరిన కాంట్రాక్టర్లకే ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు అప్పగించిందని దుయ్యబట్టారు.