'తక్షణం అసెంబ్లీ, కౌన్సిల్ను సమావేశపర్చండి'
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపన పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని దీనిని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. హైదరాబాద్లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి, దానం మాట్లాడారు.
తెలంగాణలో కరవుపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీ, కౌన్సిల్ను సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం ఢిల్లీ టూర్ రాష్ట్రప్రయోజనాల కోసం కాకుండా సొంత అజెండాలా మారిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు.
సీఎం, సంబంధిత మంత్రులు కాకుండా మంత్రి కేటీఆర్ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారని.. దీనిపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గ్రేటర్లో ఓట్ల కోసమే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగడం లేదని నాయకులు చెప్పారు.