
ప్రజల ఆకాంక్ష మేరకు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. సోనియాను ‘అమ్మా.. బొమ్మా’అంటూ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ దురుసుగా మాట్లాడుతూ తన నోటిదూలను ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, తమ పార్టీ దయతోనే కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గొంతులను కేసీఆర్ నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. జగ్గారెడ్డిపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. హరీశ్‌పై కూడా కేసు పెట్టించేందుకు కేసీఆర్ ఓ మహిళను అమెరికాకు పం పించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో చేతులు కలిపి రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో విచారణ ఎదుర్కొనేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారని, ఇందుకు సీఎం సిద్ధమేనా? అని ప్రశ్నిం చారు. ఒకవైపు కొడుకు, మరోవైపు అల్లుడి పోరుపడలేకనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని వ్యాఖ్యానించారు.
మైనారిటీలకు 14 అసెంబ్లీ సీట్లు: ఫక్రుద్దీన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మైనారిటీలకు 14 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ మహ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ స్పష్టం చేశారు. నిజాం క్లబ్‌లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి మైనారిటీ ముఖ్యుల సమవేశంలో ఈ మేరకు హామీ లభించిందన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మైనార్టీ నాయకులు జాకీర్ హుస్సేన్, ఫారూఖీ ఖాద్రీ, అరిఫుద్దీన్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం కోసం సబ్ ప్లాన్ అమలుతో పాటు నామినేటెడ్ పదవుల్లో 20 శాతం కేటాయిస్తామని హమీ ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ.. ఇప్పటివరకు కనీసం 50% కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. మైనారిటీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో మైనారిటీలందరూ కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు.
సైన్యం పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు
టీపీసీసీ కోశాధికారి గూడూరు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం భారతీయ సైన్యం, శౌర్య పరాక్రమాలపై చిల్లర రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. ‘పరాక్రమ్ పర్వ్’పేరుతో ప్రజల దృష్టిని కుంభకోణాలు, పాలన వైఫల్యాల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేకే సర్జికల్స్ స్ట్రయిక్స్ వార్షికోత్సవం పేరుతో ప్రధాని మోదీ అత్యంత చిల్లర రాజకీయాలకు దిగారని మండిపడ్డారు.
2011 ఆగస్టు 30న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సైతం సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో 1971లో భారత సైన్యం పాకిస్తాన్‌ను ఓడించిందని, 95 వేల మంది పాకిస్తాన్ సైనికులు భారతీయ సైన్యం ముందు లొంగిపోయారన్నారు. దేశ సైన్యం సాధించిన విజయాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు. రాజకీయ మనుగడ కోసం ప్రతి చిన్న విషయం నుంచి ప్రచార లబ్ధి పొందేందుకు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, బీఫ్ బ్యాన్, ట్రిపుల్ తలాక్ అంశాలు ఇందుకు ఉదాహరణ అని నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment