సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై మాట్లాడుతున్న టీఆర్‌ఎస్.. సొంత పార్టీ సంగతి చూసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. మంగళ వారం ఢిల్లీలో మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఏదంటూ టీఆర్‌ఎస్ మాట్లాడుతోందని, ఆ పార్టీ ఇంకా ప్రకటించాల్సి ఉన్న 14 స్థానాలపై 60 రోజులుగా కసరత్తు ఎందుకు చేస్తోందని ప్రశ్నిం చారు. ‘మీరు ముందు మీ ఇంటి సంగతి చూసుకోండి.
ప్రకటించిన 40 స్థానాల్లో అసమ్మతిని చూసుకోండి. ఎంతసేపూ పొరుగింట్లో ఏం జరుగుతోంది? మహాకూటమి గురించి ఇతరత్రా మాట్లాడే కంటే నాలుగున్నరేళ్లుగా తెలంగాణను ఎలా మోసం చేశారో, ఎలా అప్పులపాలు చేశారో, అబద్ధాలతో కాలం గడిపారో చెప్పండి. ప్రజాస్వామ్యం నిలబడాలని, నియంతృత్వ ప్రభుత్వం గద్దె దిగాలన్న ఏకైక లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. అనేక చర్చలు, సంప్రదింపులు, నేతల ఐకమత్యం ద్వారా జాబితాపై కసరత్తు జరుగుతోంది. ముందు చెప్పినట్లుగానే జాబి తా వెలువడుతుంది’ అని పేర్కొన్నారు.
ప్రజాకూటమిలో సమన్యాయం
ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న ప్రజాకూటమిలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల నేతలు కూడా సీఎం స్థానంలో ఉంటారని చెప్పారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల ప్రజాకూటమికి, టీఆర్‌ఎస్–బీజేపీల నేతృత్వంలోని మాయాకూటమి కి మధ్య జరుగుతున్నాయన్నారు.
మంగళవారం గాంధీభవన్‌లో యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్‌కు రాజకీయ సన్యాసమేనన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటారో, సన్నాసుల్లో కలసిపోతారో ఆయనే తేల్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను ప్రజలకేనని చెప్పారు. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందని యాష్కీ అన్నారు. ఈ నెల 9న దుబాయ్‌లో జరగనున్న గల్ఫ్ కార్మికుల సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, షబ్బీర్ అలీ, తాను పాల్గొంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment