పోరుగడ్డ నుంచి పొలికేక | praja ashirvada sabha in nalgonda | Sakshi
Sakshi News home page

పోరుగడ్డ నుంచి పొలికేక

Published Thu, Oct 4 2018 6:06 AM | Last Updated on Thu, Oct 4 2018 6:06 AM

praja ashirvada sabha in nalgonda - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దక్షిణ తెలంగాణలో 6 స్థానాలతో గత ఎన్నికల్లో తమకు వెన్నుదన్నుగా నిలి చిన నల్లగొండ జిల్లాపై టీఆర్‌ఎస్‌ ఈసారీ భారీ ఆశలే పెట్టుకుంది. ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లాలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల సొంత జిల్లాగా నల్లగొండకు ప్రాధాన్యం ఉంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ తమ నియోజకవర్గాల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 6 అసెంబ్లీ స్థానాల్లో గెలవగా, మరోచోట కాంగ్రెస్‌ పొత్తుతో సీపీఐ విజయం సాధించింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌తోపాటు జిల్లాలో దాదా పు అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ కుర్చీ దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ నుంచి పలువురు నేతలు వలసబాట పట్టినా, స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే నల్లగొండపై కాంగ్రెస్‌ పట్టు గట్టిగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నారు.

నల్లగొండలోనే ఎందుకు..?
జిల్లాలో తొలి ఎన్నికల బహిరంగ సభను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎందుకు నిర్వహించాల్సి వస్తుందో కూడా గులాబీ శ్రేణులు కారణాలు చెబుతున్నాయి. నల్లగొండ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ చేతిలో ఉండగా, ఇక్కడినుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా 4 సార్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారి జిల్లా కేంద్రంపై పట్టు సాధించాలన్న ముందు చూపులో భాగంగానే గత ఎన్నికల్లో కోమటిరెడ్డిపై ఓడిపోయి, రెండో స్థానంలో నిలిచిన టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించి ఏడాది కిందటే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. జిల్లాలో ప్రకటించిన పది మంది అభ్యర్థుల్లో కంచర్లకూ స్థానం లభించింది. నల్లగొండలో పార్టీ గెలుపును అధినాయకత్వం సవాల్‌గా తీసుకుందని, ఈ కారణంగానే సీఎం కేసీఆర్‌ నల్లగొండకు వస్తున్నారని చెబుతున్నారు. ఈసారి కాంగ్రెస్‌ను ఓడించడానికి ముందస్తు వ్యూహంలో భాగంగానే తొలి సభను నల్లగొండలో నిర్వహిస్తున్నారని పేర్కొంటున్నారు. కాగా, ఈ సభకు ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి సుమారు మూడు లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలుస్తోంది. సభ నిర్వహణ ఇన్‌చార్జ్‌గా శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకల్లా కేసీఆర్‌ సభా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement