సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు ఈసారి తప్పకుండా అవకాశం వస్తుందని ఎదురుచూసిన పలువురు టీఆర్‌ఎస్ నేతలకు నిరాశే మిగిలింది. పార్టీ అధినాయకత్వం సిట్టింగులకు టికెట్లు ఖరారు చేయడంతో తమకు ఇక అవకాశం లేనట్టేనని రూఢీ కావడంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు. జిల్లాలో నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలు మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా టికెట్లు దక్కని కొందరు ఆశావహుల అనుచరులవైపు నుంచి ఒత్తిడి బాగానే పెరుగుతోందని సమాచారం.
టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులుగా ప్రకటించిన ఆరుగురిలో నలుగురూ ఎమ్మెల్యేలు కావడం, నాగార్జున సాగర్‌లో గత ఎన్నికల్లో ఓడిపోయిన నోముల నర్సింహయ్యకు, నల్లగొండలో ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్లు ప్రకటించడంతో ఇక మిగిలిన వారికి అవకాశం దక్కకుండా పోయింది. నాగార్జునసాగర్‌లో తమ నేతకు టికెట్ దక్కకపోవడంతో ఎంసీ కోటిరెడ్డి అనుచరులు ఆత్మహత్యాయత్నాలతో బెదిరింపులకూ దిగారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడలో పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి శిబిరం ఈసారి టికెట్ ఖరారు సమయంలోనే దెబ్బతిన్నది.
ఆయనకు టికెట్ ఇవ్వకుండా, కాంగ్రెస్‌నుంచి వచ్చి చేరిన భాస్కర్‌రావుకే బెర్త్ ఖరారు కావడాన్ని ఆ వర్గీయుల జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.దేవరకొండలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ టికెట్ ఆశించే కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మూడో స్థానంలో నిలవడం, అక్కడ నాయకత్వ లేమి ఉండడంతో తనకు కచ్చితంగా అవకాశం దక్కుతుందని ఆయన భావించి గులాబీ గూటికి చేరారు. కానీ, సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్‌ఎస్‌లోకి రావడంతో బాలునాయక్‌కు చెక్‌పడింది. ఇక నల్లగొండలో అనూహ్య పరిణామాలే చోటు చేసుకున్నాయి.
గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన దుబ్బాక నరిసింహారెడ్డిని మూడేళ్లపాటు ఇన్‌చార్జ్ బాధ్యతల్లో కొనసాగించి, అకస్మాత్తుగా టీడీపీకి చెందిన కంచర్ల భూపాల్‌రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు.ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలూ ఇచ్చారు. ఇప్పుడు టికెట్ కూడా ఆయనకే ఖరారు చేశారు. నాగార్జున సాగర్ ఇన్‌చార్జ్‌గా నోముల నరసింహయ్య ఉన్నా, ఆయన స్థానికేతరుడని, స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ ముందునుంచే ఎంసీ కోటీరెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తూ వచ్చారు. ఒక విధంగా ఆయన అప్రకటిత ఇన్‌చార్జ్‌గానే నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు. తీరా టికెట్ రాకపోవడంతో ఎంసీ కోటిరెడ్డి వర్గం నిరాశలో పడిపోయింది.
మరోవైపు నల్లగొండ నియోజకవర్గంలో కంచర్ల భూపాల్‌రెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించినా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ తదితరులు టికెట్‌పై ఆశ పెట్టుకుని ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసిన వారే. మునుగోడు నియోజకవర్గం సిట్టింగ్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే టికెట్ దక్కడంతో ఈసారన్నా టికెట్ దక్కుతుందేమోనని ఆశించి న ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ భంగపాటే ఎదురైంది. అయితే ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీ ఉండడం ఊరటనిచ్చే అంశం.
ఎవరి దారి ఎటువైపు..?
మునుగోడు మినమా మిగిలిన దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లో టికెట్ రాకుండా భంగపడిన వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక రకంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నా, దేవరకొండ, మిరాల్యగూడలో ఆ పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ కొద్ది నెలలుగా కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన 2009 ఎన్నికల్లో దేవరకొండలో కాంగ్రెస్‌నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి ఇవ్వాల్సి రావడం, అంతకుముందే జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వు అయిన నల్లగొండ జెడ్పీ చైర్మన్‌గా బాలునాయక్ ఎన్నిక కావడంతో సమస్య లేకుండా పోయింది. కానీ, ఆయన కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌కు వచ్చిందే ఎమ్మెల్యే టికెట్ కోసం కావడం, అది దక్కక పోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం చర్చనీయాంశమైంది. తన దగ్గరి అనుచరులు, ముఖ్యులతో ఇప్పటికే మంతనాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక, మిర్యాలగూడనుంచి టికెట్ ఆశించిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న అంశం కూడా ఉత్కంఠ రేపుతోంది.
2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరి, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి రెండోసారీ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అసలు టికెట్ లేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. కాకుంటే, ఈ స్థానం నుంచి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడు రఘవీర్ రెడ్డి ఇక్కడినుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్న నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్‌లో దారులు మూసుకుపోయినట్టేనని విశ్లేషిస్తున్నారు. ఇక మిగిలిన ఆప్ష న్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమేనన్న అభిప్రాయ మూ వ్యక్తమవుతోంది. తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణ యం తీసుకునేందుకు టికెట్లు రాని నేతలు ముఖ్య అనుచరులతో ప్రత్యేక భేటీలకూ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
మిర్యాలగూడలో మొదటినుంచి తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వేర్వేరుగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు భాస్కర్‌రావుకు టికెట్ ఇవ్వడంతో అమరేందర్‌రెడ్డి డోలాయమానంలో పడ్డారు. కాంగ్రెస్‌లో చేరే పరిస్థితి లేదని, చివరికి స్వతంత్రంగా బరిలో దిగుతారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
అధికార పార్టీ నల్లగొండ టికెట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇచ్చారు. కానీ ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ తదితరులు టికెట్‌పై ఆశ పెట్టుకున్నారు. చకిలం అయితే పలుమార్లు కార్యకర్తలతో భేటీలు కూడా నిర్వహించారు. కానీ కంచర్లకు టికెట్ ప్రకటించడంతో తరువాత పరిణా మాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
నాగార్జున సాగర్ ఇన్‌చార్జ్‌గా నోముల నరసింహయ్యకు టికెట్ ఖరారు కావడంతో ముందునుంచీ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి నిరాశలో ఉన్నారు. అయితే ఇక్కడ స్థానిక అంశం తెరమీదికి వస్తోంది. నోముల స్థానికేతరుడని ఎంసీ కోటిరెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. మొదటినుంచీ ఈ నియోజకవర్గంలో నోముల, ఎంసీ కోటిరెడ్డి వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
దేవరకొండ టికెట్ సిట్టింగ్ అభ్యర్థి రవీంద్రకుమార్‌కు కేటాయించారు. అయితే రవీంద్రకుమార్ సీపీఐ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ జెడ్పీచైర్మన్ బాలునాయక్ టికెట్ ఆశించారు. ఆయన కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరింది కూడా టికెట్ హామీతోనే. కానీ సిట్టింగ్‌కు అవకాశం ఇవ్వడంతో ఆయన ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment