
తుంగతుర్తిలో జనచైతన్యయాత్ర ముగింపు సభలో మాట్లాడుతున్న జవదేకర్. చిత్రంలో దత్తాత్రేయ, లక్ష్మణ్, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి తదితరులు.
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పంచ పాండవులు.. వంద మంది టీఆర్‌ఎస్ కౌరవులతో పోటీ పడుతున్నారు. దేశంలో కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతం చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అవినీతి పాలనను అంతమొందిస్తాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 జిల్లాల్లో జన చైతన్య యాత్ర మొదటి విడతను విజయవంతంగా పూర్తి చేయడంపై ఆయన రాష్ట్ర బీజేపీకి అభినందన తెలిపారు. బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్ర తొలివిడత ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రైతుల సంక్షేమంకోసం 14 పంటలకు మద్దతు ధర ప్రకటించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే దక్కిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రైతులు సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటుందని ప్రధాని మోదీ రైతులకోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. రైతు బాంధవుడు మోదీ అని, రాష్ట్రంలో చేపట్టిన రైతుబంధు పథకంతో రైతులకు ఒరిగింది ఏమీలేదని, అది కేవలం భూస్వాముల పథకమని విమర్శించారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని, కానీ మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. నాడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి రూ.100 పంపితే గల్లీలోని లబ్ధిదారుడికి చేరేసరికి రూ.15 మాత్రమే అందేవన్నారు. అదే నేడు ప్రధాని మోదీ పాలనలో ఢిల్లీ నుంచి రూ.100 పంపితే గల్లీలో ఉన్న లబ్ధిదారుడికి రూ.100 అందుతున్నాయన్నారు. ప్రధాని మోదీ కేంద్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని అన్నారు.
దేశంలో దళితుల అభివృద్ధి కోసం పంచతీర్థాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2014 ఎన్నికల వరకు దేశంలోని 29 రాష్ట్రాల్లో బీజేపీ 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఈ 4 ఏళ్లలోనే 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 4 ఏళ్లలో 106 సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. జన్‌ధన్ ఖాతాల ద్వారా దేశంలో 30 కోట్ల అకౌంట్లు తెరిపించామన్నారు. దీని ద్వారా రూ.3.85 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అందజేసినట్లు వివరించారు. కేంద్రం వెనుకబడిన తరగతుల సంక్షేమంకోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, అయితే దానిని రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకొని అమలు కాకుండా చేశాయని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇది కార్యరూపం దాల్చేలా చూస్తామన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా కావడానికి కేంద్ర సహకారం కూడా ఉందన్నారు. ఖమ్మంలో 2వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చామన్నారు. కాగా, రాష్ట్రంలో పంచ పాండవుల్లాగా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, 100 మంది కౌరవుల్లాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని విమర్శించారు. నాడు భారతంలో ఏ విధంగా జరిగిందో, రాబోయే ఎన్నికల్లో కూడా అదే విధంగా జరుగుతుందన్నారు. జనచైతన్య యాత్రల ద్వారా ప్రజలు బీజేపీకి ఎంతో దగ్గరయ్యారన్నారు. ఈ యాత్రతో బీజేపీకి రాష్ట్రంలో ప్రజాదరణ పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావుకు టీడీపీ ఒత్తిడితో టికెట్ ఇవ్వలేకపోయామని, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి సంకినేనికే టికెట్ ఇస్తామని, ఆయన గెలుపు ఖాయమని జవదేకర్ పేర్కొన్నారు. టీడీపీ వెన్నుపోటు పొడిచే పార్టీ అని, దాన్ని ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఇక నమ్మరన్నారు.
బీజేపీ జెండా ఎగురవేస్తాం: లక్ష్మణ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ జనచైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ టీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకత తెలుపుతున్నారన్నారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు మళ్లీ పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ జెండా దింపి బీజేపీ కాషాయ జెండాను ఎగురవేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ కేబినెట్‌లో సామాజిక న్యాయం లేదన్నారు. బీజేపీ పాలనలో ముస్లింను రాష్ట్రపతి, తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్‌ను కేంద్రమంత్రిని చేశామన్నారు. మోదీ దెబ్బకు కాంగ్రెస్, కమ్యూనిస్టుల కోటలు కూలుతున్నాయని, త్వరలో టీఆర్‌ఎస్ గడీలు బద్దలు కావడం ఖాయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బూటకమని, కమీషన్ల కోసమే దానిని చేపట్టారని అన్నారు.
అంతా మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన జనచైతన్య యా త్ర ముగింపు సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ కృష్ణదాసు, నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, ధర్మారావు, రామకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, మనోహర్‌రెడ్డి, వెదిరె శ్రీరాం, వెంకటేశ్వర్లు, సాంబమూర్తి, శ్రీనివాస్, మ«ధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment