
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సముద్ర విమానం (సీప్లేన్)లో జేమ్స్‌బాండ్‌లా ప్రయాణించి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'సీ ఛేంజ్'ను తీసుకు రావాలని భావించారు. అక్కడే ఆయన పెద్ద పొరపాటు చేశారు. వెనకా ముందు ఆలోచించకుండా, వాస్తవాస్తవాలను పట్టించుకోకుండా దేశంలో అన్నిచోట్ల విమానాశ్రయాలను నిర్మించడానికి అనువైన స్థలాలు దొరకవని, అందుకనే పలు చోట్ల సముద్రపు ప్లేన్లను ప్రవేశపెట్టాలని తన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ నది నుంచి మెహసానాలోని ధరాయ్ డ్యామ్ వరకు సముద్ర విమానంలో ఆయన ప్రయాణించడాన్ని ఇక ఆయన వెబ్‌సైట్ 'డబ్లూడబ్లూడబ్లూ. నరేంద్రమోదీ డాట్ ఇన్' ఆకాశానికి ఎత్తింది. 'భారత్‌లోని మొట్టమొదటి సముద్ర విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రయాణికుడు ప్రధాన మంత్రి మోదీ' అంటూ శీర్శిక పెట్టింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికార వెబ్‌సైటే కాకుండా పలువురు బీజీపీ నాయకులు కూడా గుడ్డిగా ఈ హెడ్డింగ్‌ను కాపీ చేసి ట్వీట్లు చేశారు.
సీప్లేన్‌తో కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్
అంతకంటే ఘోరంగా, ఎలాంటి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించకుండా పలు జాతీయ, ప్రాంతీయ పత్రికలతోపాటు పలు టీవీ ఛానళ్లు 'భారత్ తొలి సముద్ర విమానంలో ప్రయాణించిన తొలి ప్రయాణికుడు ప్రధాని మోదీ' అంటూ వార్తలను ప్రసారం చేశాయి. చేసిన పొరపాటును ముందుగానే గ్రహించిన నరేంద్ర మోదీ వెబ్‌సైట్ 'భారత్‌లోని మొట్టమొదటి సముద్ర విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రయాణికుడు మోదీ' అన్న మాటలను తొలగించి 'సముద్ర విమానంలో ప్రయాణించిన మోదీ' అని తప్పును సరిదిద్దుకుంది. అయినప్పటికీ టీవీ ఛానళ్లు, పత్రికలు పొరపాటును సరిదిద్దుకోక పోవడం విచారకరమే.
సీప్లేన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రధాని నరేంద్ర మోదీ
వాస్తవానికి సముద్ర విమానాల సర్వీసులు భారత్‌లో 2010 సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. అండమాన్, నికోబార్‌లోని ప్రభుత్వ యంత్రాంగం 2010లో 'జల్ హంస' పేరిట ఈ సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించింది. జల్ హంస ఆ తర్వాత పవన్ హంస అనే సంస్థతో కలిసి ఈ విమాన సర్వీసులను కొంతకాలం నడిపింది. ప్రఫుల్ పటేల్ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ సర్వీసులు గిట్టుబాటు లేక అనతి కాలంలోనే నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ప్రఫుల్ పటేల్ ట్వీట్ ద్వారా మీడియాకు ధ్రువీకరించారు. 2013లో కేరళ పర్యాటక శాఖ, ఊమెన్ చాండీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీప్లేన్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అప్పుడే రాష్ట్రంలోని జల మార్గాలన్నింటిని కలుపుతూ ఈ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రాష్ట్ర మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండానే ఆగిపోయింది.
దేశంలోని పలు చోట్ల పర్యాటకులను దష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు సంస్థలు సీప్లేన్లను ప్రవేశపెట్టాయి. మెహేర్ అనే సంస్థ 2011లో అండమాన్, నికోబార్‌లో సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించింది. ఆ తర్వాత ఆ సర్వీసులను మహారాష్ట్ర, గోవాలకు విస్తరించింది. ప్రభుత్వ అనుమతులు చికాకు పెట్టడం, వాణిజ్యపరంగా గిట్టుబాటు లేకపోవడంతో ఈ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. 2012లో కేరళ, లక్ష్యదీవుల్లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు 'సీబర్డ్ సీప్లేన్ ప్రైవేట్ లిమిటెడ్' ప్రకటించింది. మత్స్యకారుల ఆందోళన కారణంగా అనుమతులు ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం నిరాకరించడంతో ఈ ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయింది.
సరిగ్గా ఈ నేపథ్యంలో భారత్‌లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించడం కోసం 'స్పైస్‌జెట్' సంస్థ కొడైయిక్ క్వెస్ట్ సీప్లేన్‌ను ముంబై తీసుకొచ్చి గిర్‌గామ్ ప్రాంతంలో డిసెంబర్ 9వ తేదీన ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారి, అశోక గజపతి రాజు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 'ఎన్ 181 కేక్యూ' నెంబర్ కలిగిన ఈ సీప్లేన్‌లో వారిరువురు కేంద్ర మంత్రులు ప్రయాణించారు. ఇప్పుడు సరిగ్గా అదే సీప్లేన్‌లో మంగళవారం నరేంద్ర మోదీ ప్రయాణించారు. స్పైస్‌జెట్ దేశంలో వంద సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాలనే ఆలోచనతో ఉంది. అందుకావాల్సిన ప్రభుత్వ అనుమతుల కోసమే మంత్రుల సమక్షంలో ట్రయల్స్ నిర్వహించింది. ఆ ట్రయల్స్‌లో భాగంగానే మోదీకి కూడా సర్వీసు అందించి ఉంటుంది. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వార్తలు వెలువడలేవు. మోదీ మాటల ప్రకారం త్వరలోనే ఆయన ప్రభుత్వం స్పైస్‌జెట్ సీప్లేన్‌లకు అనుమతిస్తుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు సీ ప్లేన్ నుంచి ప్రయాణికులు దిగేందుకు ఎక్కడా ఏర్పాట్లు లేవు. మోదీ దిగుతున్న ఫొటో బాగా రావాలంటే ఆయన దిగేందుకు ఏర్పాట్లు ఉండాలి. అందుకని సీప్లేన్ నుంచి ఆయన దిగేందుకు ప్రత్యేక చప్టాను తయారు చేశారు. చప్టా లేకపోవడంతో గడ్కారి దిగేందుకు మొన్న ఇబ్బంది పడిన విషయాన్ని ఆయన సీప్లేన్ నుంచి దిగుతున్న వీడియో చూస్తే తెలిసిపోతుంది. 'భారత్‌లోని మొట్టమొదటి సీప్లేన్ నుంచి దిగిన మొట్టమొదటి ప్రయాణికుడు ప్రధాని మోదీ' అనడంలో అర్థం ఉందా? అందుకనే ఆయన్ని ఆయన పార్టీ సహచరుడు ఎల్‌కే అద్వానీ 'మోదీ మంచి ఈవెంట్స్ మేనేజర్' అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment