
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. హిందీలో ఈశ్వరుడి సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. లోక్‌సభలో ప్రధాని మోదీ పేరు ప్రకటించగానే బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మోదీ జిందాబాద్ అంటూ నినదించారు. ప్రమాణం చేశాక సభలోని సభ్యులందరికీ రెండు చేతులు జోడించి మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు.. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ప్రధాని తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత సురేశ్ కొడికున్నిల్ ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, హర్‌సిమ్రత్ కౌర్, స్మృతి ఇరానీ ప్రమాణం చేశారు.
వీడిన సందిగ్ధం
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనేదానిపై సందిగ్ధం వీడిపోయింది. కేరళ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేశ్ కొడికున్నిల్ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎన్నికయినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఆయన ప్రమాణం చేయడంతో దీనిపై స్పష్టత వచ్చినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment