న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల గొంతును వినేందుకు కేంద్రం భయపడుతోందని, అందుకే విద్యార్థులను, జర్నలిస్టులను అణచివేయడం ద్వారా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
యువత ధైర్యాన్ని, గొంతును అణచివేసేందుకు నరేంద్రమోదీ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించాలని చూస్తోందని, కానీ, ఒకనాటికి యువత గళాన్ని కేంద్రం వినకతప్పదని ఆమె హెచ్చరించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆమె ట్విటర్‌లో మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.
‘దేశంలోని యూనివర్సిటీల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొడుతున్నారు. ప్రజలు గొంతు వినాల్సిన సమయంలో బీజేపీ సర్కారు విద్యార్థులు, జర్నలిస్టుల అణచివేత ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది పిరికిపంద ప్రభుత్వం’ అని ఆమె విమర్శించారు. ‘మోదీజీ భారతీయ యువత గళాన్ని వినండి. వారి గొంతును మీరు అణచివేయలేరు. ఎప్పటికైనా మీరు వినాల్సిన పరిస్థితి వస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు.
చదవండి: చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు!
Comments
Please login to add a commentAdd a comment