సాక్షి, విశాఖపట్నం: ‘తొక్క తీస్తా.. తోలు తీస్తానంటున్నావే.. మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా? ప్రజాక్షేత్రంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావా?’అని పవన్‌కల్యాణ్‌పై సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ ఏపీ కార్యదర్శి పృథ్వీ ధ్వజమెత్తారు. అవినీతి చేసే టీడీపీ నేతల తోలు తీయ్యండి.. అంతేకానీ నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని పవన్‌ను హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడని, ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థనాయకుడు జనసేన అధ్యక్షడు పవన్ అని విమర్శించారు. ఆదివారం విశాఖ మద్దిలపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీని బంగారు సైకిల్ అని, చంద్రబాబుని నీతిమంతుడని పొగిడి టీడీపీకి ఓట్లు వేయించావు.. మళ్లీ ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుని సీఎం చేయాలని కష్టాలు పడుతున్నావ్.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీ ఇద్దరికీ చరమగీతం పాడతారని చెప్పారు.
ఓటు కూడా ఏ తేదీన వేయాలో తెలియని మంగళగిరి మాలోకం లోకేష్‌ని ఒక్క మాటైన అన్నావా? నువ్వా ప్రజాక్షేత్రంలో అవినీతిని ప్రశ్నించేది? అని మండిపడ్డారు. ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతోపాటు నీ పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వీధి నాటకాల ద్వారా సినిమా కళాకారులమంతా టీడీపీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తామన్నారు.
సినీ నటుడు జోగినాయడు మాట్లాడుతూ.. తాము తిరిగిన విశాఖలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు. గ్రామాల్లో పర్యటించి చంద్రబాబు, పవన్‌ల మధ్య చీకటి ఒప్పందం బయటపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు కృష్ణతేజ, జయశిల, పద్మరేఖ, ఆశ, తేజస్విని, అజయ్, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి, అదనపు కార్యదర్శి రవిరెడ్డి, నేతలు రాజుబాబు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment