బీజేపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అవసరం ఉన్నప్పుడు వాడుకొని, అవసరం లేనప్పుడు వదిలేసే తత్వం చంద్రబాబునాయుడిదని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి వస్తున్న ఆదరణ చూడలేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేందుకు చంద్రబాబు ఎత్తుగడ వేశారన్నారు. బీజేపీని రాజకీయ క్రీడలో భాగంగా వాడుకున్నారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొన్నట్టు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో ఉంటారన్నారు. పొత్తులతో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవినీతి రహితపాలన అందిస్తున్న నరేంద్రమోదీకి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ విజయం సాధించిందన్నారు.
రాష్ట్రంలో కార్యకర్తల బలం ఉందని, బలం నిరూపించుకొనేలా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తొలుత స్థానిక గాంధీనగర్ మున్సిపల్ పార్కులో స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగుతున్న పనులు పరిశీలించారు. కేంద్రం కాకినాడ స్మార్ట్‌సిటీ అభివృద్ధికి నిధులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. రెండేళ్ల క్రితం కేంద్రం కాకినాడకు రూ.400 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ.250 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే ప్రారంభించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు పర్సంటేజీల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని వాపోయారు. సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పైడా కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షుడు వై మాలకొండయ్య, కార్పొరేటర్లు సాలగ్రామ లక్ష్మీప్రసన్న, నల్లబిల్లి సుజాత, గోడి సత్యవతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment