సోషల్‌ మీడియాలో రాధికా హల్‌చల్‌ | Radhika Kumaraswamy Trending In Social Media | Sakshi
Sakshi News home page

Published Thu, May 24 2018 3:38 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Radhika Kumaraswamy Trending In Social Media - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి కన్నా ఆయన రెండో భార్య రాధికా కుమారస్వామి లేదా కుట్టీ రాధిక ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. మూడు నెలలకు మించి కుమార స్వామి ప్రభుత్వం మనుగడ సాగించలేదంటూ మూడు రోజుల బీజేపీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప శాపనార్థాలు పెడుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ఓ కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. రాధికా కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేస్తే మూడు నెలలుకాదు, 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేలా తాము చూసుకుంటామంటూ సోషల్‌ మీడియా ట్వీటై కూస్తోంది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కుమారస్వామికి గవర్నర్‌ నుంచి ఆహ్వానం అందిన మరుక్షణం నుంచే రాధికా ఫొటోల హల్‌చల్‌ మొదలైంది. ముఖ్యంగా పెళ్లికి ముందు ఆమె చేసినట్లుగా భావిస్తున్న బెల్లీ డ్యాన్స్‌ నేటి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. రాధికా కన్నడ నటి, నిర్మాత అవడమే కాదు, అందచందాలలో తనకు తానే సాటి. అలాంటి అందమైన తార పక్కన కుమార స్వామిని ఊహించడం కష్టం. ఎక్కువ మంది ఇష్టంగా కాకుండా నిష్ఠూరంగానే కుమార స్వామి భార్యగా ఆమె గురించి చెబుతున్నారు. 2006, లండన్‌లో కుట్టీ రాధికను కుమార స్వామి రహస్యంగా వివాహమాడినట్లు అప్పట్లో కర్ణాటకలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని కుమార స్వామి, ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. తాను కుమార స్వామిని పెళ్లి చేసుకున్నట్లు రాధిక మొదటి సారి 2010లో బహిరంగంగా ప్రకటించారు. మొదటి భార్య అనిత బతికి ఉండగా రెండో పెళ్లి చేసుకున్నందుకు తన రాజకీయ జీవితానికి అవాంతరం కలుగుతుందన్న ఉద్దేశంతో కుమార స్వామి తన పెళ్లిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు మౌనం పాటిస్తున్నారు.

హిందూ వివాహ చట్టం–1955ను ఉల్లంఘించి రాధికను రెండో పెళ్లి చేసుకున్నందున ఆయన ఎంపీ పదవని రద్దు చేయాలంటూ కుమార స్వామిపై 2011లో ఓ కేసు దాఖలైంది. సరైన ఆధారాలు లేవంటూ కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కుమార స్వామి కూతురు శ్యామిక కే. కుమార స్వామి పుట్టిన రోజు సందర్భంగా రాధిక, కుమార స్వామి ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేయడంతో మరోసారి ఆయన వివాహం వివాదాస్పదమైంది. నైనాగాగి సినిమాతో 14వ ఏటనే కుట్టీ రాధికా కన్నడ సినీరంగ ప్రవేశం చేశారు. వాస్తవానికి ఆమె మొదట నటించిన చిత్రం ‘నీల మేఘ శ్యామ’ చిత్రం రెండో చిత్రంగా విడుదలయింది. అప్పటి నుంచే మన రాజకీయ నీల మేఘ శ్యాముడు కుమార స్వామి పట్ల రాధిక ప్రేమ మరులుగొల్పిందేమో! అంటూ సోషల్‌ మీడియాలో ఛలోక్తులు వస్తున్నాయి. కానీ అప్పటికి ఆమె రతన్‌ కుమార్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. వారిద్దరు 2000 సంవత్సరంలో గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. రాధికా తండ్రి మైనర్‌ బాలికను మోసం చేశారంటూ రతన్‌ కుమార్‌పై కేసు పెట్టి రాధికకు విడాకులు ఇప్పించారు. 2002లో ఆ రతన్‌ కుమార్‌ గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు కుమార స్వామిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కుమార స్వామి రాజకీయ నాయకుడికన్నా సినిమా నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా స్థానిక ప్రజలకు ఎక్కువ పరిచయం.

కన్నడ, తమిళంలో దాదాపు 22 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రాధిక ‘భద్రాది రాముడు’ అనే ఒకే ఒక్క తెలుగు చిత్రంలో తారక రత్న పక్కన నటించారు. నిర్మాతగా కూడా ఆమె మూడు, నాలుగు చిత్రాలు తీశారు. ‘శ్యామిక ఎంటర్‌ప్రైజెస్‌’ అని తన కూతురు పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ఆమె ఏర్పాటు చేశారు. ఆమె తీసిన ‘లక్కీ’ చిత్రంలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, మరో నటి రమ్య కూడా నటించారు. ఆమె మొన్నటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుమార స్వామి, రాధికల వివాహం గురించి మీడియా ముందు ప్రస్థావించారు. వారిద్దరు పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలుసునని, వారి కూతురిని కూడా చూశానని చెప్పారు. రాధిక కూడా కూతురు ప్రొడక్షన్‌ పేరుతో నిర్మించిన ఓ సినిమాకు కూడా ‘హెచ్‌డీ కుమార స్వామి సమర్పించు’ అని కూడా పెట్టుకున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. తమిళనాడులో డీఎంకే నాయకుడు కరుణానిధి తన మొదటి భార్య పద్మావతి చనిపోయాక, తక్కువ కాల వ్యవధిలో ఇద్దర్ని పెళ్లి చేసుకున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం అది తప్పే అయినప్పటికీ తమిళనాడు ప్రజలు ఈ పెళ్లిళ్లను గౌరవిస్తారు. అయ్యగారు ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగితే చిన్న వీడు (చిన్నింటికి వెళ్లారు) అని గౌరవంగా చెబుతారు. మరో డీఎంకే నాయకుడు టీఆర్‌ బాలుకు ఇద్దరు భార్యలు ఉన్నారు.

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌కు ఇద్దరు భార్యలున్నారంటూ ఆయన సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎంపీగా ఉన్న హేమ మాలిని కూడా మొదటి భార్యకు విడాకుల ఇవ్వని ధర్మేంద్రను చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన హరిజీవన్‌భాయ్‌ పటేల్, మధు శ్రీవాత్సవ లాంటి గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. వారు  ఆ విషయాన్ని బహిరంగంగా కూడా చెప్పుకున్నారు. ఎవరైన ఎన్నికల కమిషన్‌ లేదా కోర్టు వద్దకు వెళ్లి ఇద్దరు భార్యలున్నట్లు రుజువు చేస్తేనే ముప్పు వస్తుంది. కుమార స్వామికి రెండో భార్య ఉన్నట్లు రుజువైనా ఆయన సీఎం పదవి ఎంతో కాలం నిలబడదు. కాకి ముక్కుకు దొండ పండుగా రాధికను అభివర్ణిస్తున్న సోషల్‌ మీడియా, సినీ నిర్మాతగానే ఆమెను వలలో వేసుకొని ఉంటారని, అది క్యాస్టింగ్‌ కౌచ్‌ కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement