రాహుల్‌గాంధీ రాజకీయ సలహాదారు ఎవరై ఉంటారో ఒక్కసారి ఊహించండి. 2005లో మన్మోహన్ సింగ్ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) సందర్శించినప్పుడు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించిన యువ కామ్రేడ్ సందీప్ సింగే నేటి రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలకు రాజకీయ సలహాదారుగా మారాడు. అయితే ఇది అధికారికంగా ప్రకటించనప్పటికీ రాహుల్, ప్రియాంకకు ఈయనే సలహాదారుగా ఉన్నారు. రాహుల్, ప్రియాంకల ప్రతి మాటలోనూ, ప్రతి నడవడికలోనూ సందీప్ మార్కు స్పష్టమవుతూనే ఉంది. అంతదాకా ఎందుకు.. రాహుల్ సభల్లో మాట్లాడే ప్రతి పలుకూ సందీప్‌దేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. వామపక్ష భావజాలం నుంచి వచ్చి, భారత రాజకీయాలపైనా, భాషపైనా పట్టున్న సందీప్ సింగ్ ఇప్పుడు రాహుల్‌గాంధీకి ఉపన్యాసాలు రాసిపెడతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకా వాద్రాని గైడ్ చేయడం కోసం రాహుల్‌గాంధీ సందీప్ సింగ్‌ని ఎంచుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీకి సింగ్ ఎప్పుడు, ఎక్కడ పరిచయం అన్నది తెలియదు కానీ హఠాత్తుగా 2017 నుంచీ రాహుల్ గాంధీ దగ్గర సందీప్ ప్రత్యక్షమయ్యాడన్నది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం.
నాడు రైవల్.. నేడు అడ్వయిజర్
ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో సందీప్‌సింగ్ జన్మించారు. అలహాబాద్ వర్సిటీలో డిగ్రీ చేసి, జేఎన్‌యూలో కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్ట్) లిబరేషన్ అనుబంధ సంస్థ, జేఎన్‌యూలో ప్రభావవంతంగా పనిచేస్తోన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారు. 2007లో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జేఎన్‌యూ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ పాలిటిక్స్ నుంచి సైతం వైదొలిగి, అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో లోక్‌పాల్ బిల్లుకోసం సాగిన ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. జేఎన్‌యూలో ఎన్‌ఎస్‌యూఐకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సలహాదారుడిగా ఉండడాన్ని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రియాంక గంగా యాత్ర సందర్భంగా సావిత్రీబాయి ఫూలే అనే దళిత నాయకురాలిని వెంటబెట్టుకుని ప్రియాంక యాత్ర కొనసాగించడం గానీ, దళిత హక్కుల యువ నేత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ని కాంగ్రెస్ నేతలు కలవడం గానీ సందీప్ సింగ్ సలహా కారణంగానే జరిగాయని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment