సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరనుంది. సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్‌తోపాటు పలు కీలక పార్టీల అధినేతలకు కూడా శ్రీ రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని వెల్లడించిన విషయం విదితమే. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధానితో సహా బీజేపీ నేతృత్వంలోని కీలక నేతలు జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొంటే.. ఆ రోజు కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమి నేతలు, ఇతర పార్టీ నేతలు ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.
మమతా బెనర్జీ కాళీఘాట్ సందర్శన..
మతం అనేది వ్యక్తి గతమైన విశ్వాసమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆమె జనవరి 22న కోల్‌కతా సమీపంలోని కాళీఘాటకు వెళ్లి కాళీమాతను దర్శింకుంటానని తెలిపారు. అదేవిధంగా మత సామరస్యం పెంపొందాలని ర్యాలి చేపట్టనున్నట్లు తెలియజేశారు.
రాహుల్‌గాంధీ అస్సాంలో టెంపుల్ దర్శనం?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయం యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక యాత్రలో భాగంగా అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు జనవరి 22న అస్సాంలోని ఓ గుడిని సందర్శిస్తారని తెలుస్తోంది.
ఆ రోజు కాకుండా మరో రోజు..
రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదటి ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాను రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేనని వెల్లడించారు. రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తాను అయోధ్య రాముడిని చాలా సులువుగా దర్శించుకుంటానని తెలిపారు. అప్పటి వరకు రాముడి మందిరం పూర్తిగా నిర్మాణం అవుతుందన్నారు.
ఇంకా ఆహ్వానం అందలేదు..
ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రస్తుతానికి రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందకపోవటం గమనార్హం. కానీ, ఆయన ఇప్పటికే రామ భక్తిలో నిండిపోయారు. జనవరి 22 రోజును ఢిల్లీ వ్యాప్తంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఆదేశించారు. సుందరకాండ పఠన కార్యక్రమాలను ఏర్పాటు చేయటంలో ఆప్ ప్రభుత్వం నిమగ్నమైంది. దేశ ప్రజలు కోరుకున్నవి జరగాలని అయోధ్య బాలరాముడికి ప్రార్థన చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే.. ‘మహా హారతి’
మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తన పార్టీ నేతలు, కార్యకర్తలతో జనవరి 22న నాసిక్‌లోని కాలారామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భగవాన్ కాలారామ్‌కు ‘మహా హారతి’ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆలయంలో నల్లరాతితో ఉన్న విగ్రహంలో రాముడు దర్శనం ఇస్తారు. రాముడు వనవాస సమయంలో నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో సీతా, లక్ష్మణులతో ఉండేవారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ జనవరి 22న జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక.. తమిళనాడులో డీఎంకే పార్టీ.. ఆధ్యాత్మికత పేరుతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్.. గత నెలలోనే తాము అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరుకామని తెలిపారు. తాము మతాలకు సంబంధించిన విశ్వాసాలు గౌరవిస్తామని అన్నారు. అయితే రాజకీయ ముగుసులో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలపై నమ్మకం లేదన్నారు.
జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ కౌంటర్
బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజే పూరి జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌ను ప్రారంభించాడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక విశ్వాసాలను బలోపేతం చేయటమే కాకుండా ఒడిశాలో బీజేపీకి కౌంటర్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌తో సహా ఇండియా కుటమి నేతలు.. బీజేపీ రామ మందిరాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా వాడుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం అని మండిపడుతున్నారు. ఇక.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హజరుకాకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.
చదవండి: Ayodhya Ram Mandir: 31 ఏళ్ల క్రితం అయోధ్య ముఖం చూడనన్న ప్రధాని మోదీ!
Comments
Please login to add a commentAdd a comment