రాహుల్‌ గాంధీ రాజకీయ సెటైర్లు | Rahul Gandhi Political Satires | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ రాజకీయ సెటైర్లు

Published Sat, Dec 16 2017 4:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rahul Gandhi Political Satires - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2004లో జరిగిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా రాజకీయ రంగంలోకి ప్రవేశించిన రాహుల్‌ గాంధీ ఇటీవల తన భాషకు చాలా పదును పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు కూడా వేస్తూ వస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మొన్నటి వరకు ‘సూటు బూటు ప్రభుత్వం’ అని సంబోధించారు. ‘అచ్చే దిన్‌ ప్రభుత్వం’ అంటూ కూడా హేళన చేస్తూ వచ్చారు. 

భారత్, అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయంటూ నరేంద్ర మోదీ స్వయంగా వ్యాఖ్యానించినప్పుడు, పాకిస్థాన్‌తో పెరుగుతున్న అమెరికా సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. ‘ట్రంప్‌కు మరో హగ్‌ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఉన్నారు. తొందరగా వెళ్లండి మోదీజీ!’ అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి కుంభకోణం నుంచి తన కుమారుడు జై షాను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రక్షిస్తున్నారంటూ వార్తలు వచ్చినప్పుడు ‘బేటీ బచావోను ఎంచక్కా బేటా బచావో’గా మార్చారంటూ విమర్శించారు.

‘బేటీ బచావో, బేటీ పాడావో’ అన్నది ప్రధాని మోదీ నినాదమన్నది తెల్సిందే. 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి వరకు ఆ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ ఆ పక్కనున్న రాయ్‌బరేలి నియోజక వర్గానికి మారారు. రాహుల్‌ జాతీయ యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా 2007లో, పార్టీ ఉపాధ్యక్షుడిగా 2013లో నియమితులయ్యారు. 

2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించారు. భారీ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములకు భారీ నష్టపరిహారం చెల్లించాలంటూ రైతుల పక్షాన ఆందోళన చేయడంతో 2011లో యూపీలో రాహుల్‌ అరెస్ట్‌ అయ్యారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లును గట్టిగా సమర్థించిన రాహుల్, రాజకీయ నాయకుల్లో అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్‌పాల్‌ బిల్లు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

అలాంటి బిల్లులను తీసుకరావడం పెద్ద ప్రయోజనం ఉండదని విమర్శించారు. అందుకు సామాజిక కార్యకర్త అన్నా హజారే నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ‘దారిద్య్రం అంటే ఓ మానసిక స్థితి. తినడానికి తిండి లేకపోవడమో, మరేంటో లేకపోవడము కాదు. ఆత్వ విశ్వాసం ఉంటే దారిద్య్రాన్ని ఎవరైనా జయంచవచ్చు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ పార్టీలకు దొరికిపోయారు. ‘దారిద్య్రం ఓ మానసిక స్థితి’ అనడం పట్ల పలు పార్టీలు ఆయనపై అప్పుడు ధ్వజమెత్తాయి.

2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్ల అనంతరం ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ‘దేశంలో అల్లర్లు సృష్టించేందుకు నిరాశ, నిస్పృహ, అసంతృప్తిలతో రగిలిపోతున్న భారత యువతను పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ నియమిస్తోందంటూ నాకో పోలీసు అధికారి చెప్పారు’  అని వ్యాఖ్యానించడంతో బీజేపీ, ప్రధాన రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. కేంద్ర హోం శాఖ, రా, ఐబీలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించారు. 

హిమాచల్, గుజరాత్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందన్న వాదనను రాహుల్‌ నమ్మడం లేదు. ఈ నెల 18వ తేదీన ఫలితాలు వస్తాయి కదా, ఆ రోజు తేల్చుకుందామంటూ చెబుతున్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారం ద్వారా ఆయన నాయకత్వం కొంత పరిణితి చెందినట్లు కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా వచ్చే ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల ద్వారా ఆయన తొలి సవాల్‌ను ఎదుర్కోనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement